Delhi Pollution : కాలుష్యంతో విలవిల

Delhi Pollution : కాలుష్యంతో విలవిల
న‌వంబ‌రు 10వ తేదీ వరకు సెలవులు ప్ర‌క‌టించిన ప్రభుత్వం

దిల్లీలో కాలుష్యం భూతం కోరలు చాస్తుండటంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. దీపావళి నుంచి మళ్లీ సరిబేసి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రాథమిక పాఠశాలలకే సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వాటిని హైస్కూళ్లకు కూడా పొడిగించింది. కాగా.. దిల్లీలో ప్రజలు ప్రమాదకర స్థితిలో జీవిస్తున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశ రాజధాని దిల్లీలో వాయునాణ్యత సూచీలు దారుణంగా క్షీణిస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణకు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి తర్వాతి రోజు నుంచి మళ్లీ సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. నవంబరు 13 నుంచి 20వరకు ఈ విధానం అమల్లో ఉండనున్నట్లు తెలిపారు. ఈ విధానం ప్రకారం.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు చివరన సరి సంఖ్య ఉన్న వాహనాలు ఒక రోజు, బేసి సంఖ్య ఉన్న వాహనాలు మరో రోజున రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. దిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సరి-బేసిపై నిర్ణయం తీసుకున్నారు.


దిల్లీలో భద్రత దృష్ట్యా.. పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10, 12 తరగతుల వారికి మినహా అన్ని పాఠశాలలకు నవంబరు 11 వరకు సెలవులు ప్రకటించినట్లు గోపాల్‌ రాయ్‌ తెలిపారు. ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులు ప్రకటించగా ఇప్పుడు ఉన్నత పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. దిల్లీలో డీజిల్‌ ట్రక్కుల ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు. BS-3, BS-4 వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కాలుష్యం స్టేజ్‌ ఫోర్‌ గ్రేడ్‌ స్థాయికి చేరడంతో అన్ని నిర్మాణపనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బాణా సంచా పేల్చితే చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

దిల్లీలో వాతావరణ కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. ఇవాళ వాయునాణ్యత సూచి 488 పాయింట్లుగా నమోదైంది. ఇది ఒకరోజులో 25 నుంచి 30 సిగరెట్లు తాగిన దానికి సమానమని వైద్యులు తెలిపారు. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 50 పాయింట్లుగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story