ALERT: ఇజ్రాయెల్‌, ఇరాన్‌కు వెళ్లొద్దు

ALERT: ఇజ్రాయెల్‌, ఇరాన్‌కు వెళ్లొద్దు
భారత పౌరులకు కేంద్రం హెచ్చరికలు.... అక్కడ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని సూచన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత పౌరులను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌, ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ లేదా ఇరాన్‌లో ఉంటున్నవారు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరపటంతోపాటు అక్కడ తమ పేర్లు నమోదు చేసుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది. పౌరులు తమ భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బాహ్య కార్యకలాపాలను సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలని పేర్కొంది. డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు జనరల్స్‌ మృతి చెందటంతో ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. అయితే... నేరుగా కాకుండా లెబనాన్‌ లేదా సిరియాలోని హెజ్‌బొల్లా, ఇతర మిలిటెంట్‌ సంస్థల ద్వారా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు చేయించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఏం జరిగిందంటే..

మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉన్నట్లు కనిపిస్తోంది. గాజాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులను కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడించారు. సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది ఇజ్రాయెల్‌ పనేనని ఆరోపించిన ఇరాన్‌.. ఇందుకు ప్రతీకారంగా దాడులు తప్పవని ఇప్పటికే హెచ్చరించింది. ఈ క్రమంలో గాజాతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ దాడులు కొనసాగిస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. దాడుల నుంచి రక్షణ, దేశ భద్రతా అవసరాల దృష్ట్యా అన్నివిధాలుగా సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌ భద్రత కోసం ఆలోచిస్తున్న అమెరికా.. ఆ దేశ సెంట్రల్‌ కమాండ్‌ అధికారి జనరల్ మైకేల్‌ ఎరిక్‌ కొరిల్లాను యూదుదేశానికి పంపించి పరిస్థితి సమీక్షిస్తోంది. ఇజ్రాయెల్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని, ఆ దేశ భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్య పరిస్థితులపై జర్మనీ, రష్యా స్పందించాయి. ఈ వ్యవహారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, సంయమనం పాటించాలని కోరాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జర్మన్‌ విమానయాన సంస్థ లుఫ్తాన్సా.. ఏప్రిల్‌ 13 వరకు టెహ్రాన్‌కు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story