Smriti Irani: దమ్ముంటే అమేథీలో పోటీ చేయాలి

Smriti Irani: దమ్ముంటే అమేథీలో పోటీ చేయాలి
రాహుల్‌ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్‌

వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి.. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేవ‌లం అమేథీలోనే పోటీ చేయాల‌ని రాహుల్ గాంధీకి స‌వాల్ విసిరారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. అయితే, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి అమేథీ ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై 55 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గడం విశేషం.

మంగళవారం స్మృతి ఇరానీ తన నియోజకవర్గంలో జన్ సంవాద్ కార్యక్రమం నిర్వహించగా, అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కూడా అమేథీ చేరుకుంది. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే అమేథీలో మరోసారి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. "రాహుల్ పై అమేథీ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇవాళ స్పష్టంగా కనిపించింది. గత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి గెలిచాక అమేథీ ఓటర్ల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పట్ల అమేథీ ప్రజలు మండిపడుతున్నారు. అందుకే రాహుల్ గాంధీ అమేథీలో అడుగుపెడితే ఖాళీగా ఉన్న వీధులు దర్శనమిచ్చాయి" అని స్మృతి పేర్కొన్నారు.

కాగా, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడ్నించి పోటీ చేస్తారన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వివరణ ఇచ్చారు. అమేథీలో ఎవరు పోటీ చేయాలన్న అంశం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి మూడు పర్యాయాలు గెలిచారని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేసేవారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ముఖ్యమైన నియోజకవర్గం అని తెలిపారు. యూపీలోని అమేథీ సీటు నుంచి గ‌తంలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ ఓడిపోయారు. 2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో 50 వేల ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ గెలుపొందారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ సీటు నుంచి రాహుల్ విజ‌యం సాధించారు. ఆ స్థానం నుంచి ఆయ‌న 4.3 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో నెగ్గారు.

Tags

Read MoreRead Less
Next Story