Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ

Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్‌ను విచారించనున్న ఈడీ
ఢిల్లీలో హైఅలర్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకున్నారన్న ఆరోపణలతో ఆయనను ఈడీ విచారించనున్నది. ఈ నేపథ్యంలో ఈరోజు కేజ్రీవాల్ ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. పీఎంఎల్ ఏ సెక్షన్ 50ఏ కింద అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర, 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీశ్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహా ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా గత 9 నెలలుగా తీహార్ లో జైల్లో ఉన్నారు.

ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రంలో బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపించారు. అర్వింద్ కేజ్రీవాల్ ను స్కాం కేసులో జైలుకు పంపించి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ ఆలోచిస్తుందని ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ ఆరోపించారు. అలా జరిగితే ఆప్ ప్లాన్ బి అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేయవచ్చనే వాదనలను మరో ఢిల్లీ మంత్రి అతిషి కూడా చేశారు. ఈడీ ప్రశ్నించిన తర్వాత సీఎంను కస్టడీలోకి తీసుకుంటుందని అతిషి ఆరోపించారు. ఆప్‌ ఆరోపణలను బీజేపీ నేత రవిశంకర్‌ప్రసాద్‌ ఖండించారు. వారు(ఆప్‌ నేతలు) చేసుకున్న కర్మ ఫలాన్ని వారే అనుభవిస్తారని వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ సీఎం కేజ్రీవాల్ ను ఏప్రిల్ నెలలోనే ప్రశ్నించింది. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బెయిలు పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈడీ సాక్షాత్తూ సీఎం కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. రూ.338 కోట్ల డబ్బు మనీ లాండరింగ్ జరిగిందని సుప్రీం న్యాయమూర్తులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story