Lok Sabha Elections: సూర్జేవాలాకు ఈసీ షోకాజ్‌ నోటీసులు

Lok Sabha Elections: సూర్జేవాలాకు ఈసీ షోకాజ్‌ నోటీసులు
హేమమాలినిపై అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో

సినీ నటి, భాజపా ఎంపీ హేమమాలినిపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలాకు ఎన్నికల సంఘం-ఈసీ నోటీసులు జారీ చేసింది. ప్రచారాలు మహిళలను కించపరిచేలా ఉండకూడదని ఈ సీ వ్యాఖ్యనించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ ప్రసంగాల సమయంలో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు తమ సలహాలను కచ్చితంగా పాటించేలా తీసుకున్న చర్యలేంటో వివరించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరింది. ఏప్రిల్‌ 11 సాయంత్రంలోగా.. సూర్జేవాలా జవాబు ఇవ్వాలని, ఆ మరుసటి సాయంత్రంలోగా ఖర్గే తన స్పందన తెలియజేయాలని ఈసీ ఆదేశించింది. హేమమాలినిని కించపరిచేలా సూర్జేవాలా మాట్లాడారని భాజపా ఆరోపించగా ఆమెను అవమానించి, బాధపెట్టాలని తాను ఎన్నడూ అనుకోలేదని, తేదీ లేని వీడియోను ఎడిట్‌ చేసి వక్రీకరించారని సూర్జేవాలా ఆరోపించారు

హేమమాలినిపై సూర్జేవాలా 'సెక్సిస్ట్' వ్యాఖ్యలు చేస్తున్నట్టు కనిపిస్తున్న ఒక వీడియోను ఈనెల 3వతేదీన బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ షేర్ చేశారు. ''ధర్మేంద్రను పెళ్లి చేసుకున్న హేమమాలిని అంటే మాకు గౌరవం ఉంది, ఆమె మన కోడలు కూడా. అయితే వీళ్లు ఫిల్మ్ స్టార్‌లు. కానీ మేము వారిలా కాదు. మీరు నన్ను కానీ లేదా గుప్తాజీని కానీ ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము మీకు సేవలందిస్తాం'' అని సూర్జేవాలా పేర్కొన్నట్టు బీజేపీ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. దీనిపై హేమమాలిని సైతం స్పందించారు. ''ప్రముఖులను మాత్రమే వాళ్లు టార్గెట్ చేస్తుంటారు. పాపులారిటీ లేనివారి గురించి మాట్లాడితే వాళ్లకు ఒరిగేదేముంటుంది? ఇలాంటి వాళ్లు మహిళలను ఎలా గౌరవించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చూసి నేర్చుకోవాలి'' అని అన్నారు.

అయితే , బీజేపీ విడుదల చేసిన వీడియో విశ్వసనీయతను సూర్జేవాలా ప్రశ్నించారు. అది వక్రీకరణలతో నిండిన ఎడిట్ చేసిన వీడియో అని వివరణ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం యువకులు, రైతులు, పేదలకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాల నుంచి ప్రజలను దారిమళ్లించేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వీడియోలను బీజేపీ ఐటీ సెల్ షేర్ చేస్తోందని తప్పుపట్టారు. ఎడిటింగ్, వక్రీకరణలతో నకిలీ వీడియోలు తయారుచేయడం ఆ పార్టీ ఐటీ సెల్ అలవాటుగా మారిందన్నారు. ''పూర్తి వీడియో వినండి. ధర్మేంద్రను వివాహం చేసుకున్నందుకు, మా కోడలైనందుకు మాకు కూడా హేమమాలిని అంటే చాలా గౌరవం ఉందని మాత్రమే నేను చెప్పాను'' అని సూర్జేవాలా మరింత వివరణ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story