Supreme Court : మరోసారి ఎస్‌బీఐకి తలంటిన సుప్రీంకోర్టు

Supreme Court : మరోసారి ఎస్‌బీఐకి తలంటిన సుప్రీంకోర్టు
బాండ్ల నెంబర్లనూ బయటపెట్టాలి

ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ -SBIకి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీచేసింది.ఎలక్టోరల్ బాండ్లపై SBI ఎన్నికల సంఘానికి అందించిన వివరాలు సరిగా లేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. బాండ్ల బాండ్స్ నెంబర్లు లేనందున ఎవరు ఎవరికిచ్చారనే వివరాలు తెలియడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అన్ని వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నప్పటికీ.. అందుకు విరుద్ధంగా SBI వ్యవహరించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 18లోపు... అన్ని వివరాలు ఈసీకి ఇవ్వాలని ఆదేశించింది. గతంలో సీల్డ్ కవర్ లో ఈసీ ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సీల్డ్ కవర్ లో ఇచ్చిన వివరాలను కూడా రేపు సాయంత్రం ఐదింటికల్లా వెబ్ సైట్ లో ఉంచాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదావేసిన కోర్టు ఆలోపు తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలని SBIని ఆదేశించింది.

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) సుప్రీంకోర్టుకు రెండు రోజుల క్రితం తెలిపింది. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ పేర్లు ఈసీకి సమర్పించినట్లు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుగుణంగా ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందించినట్లు ఎస్​బీఐ అఫిడవిట్​లో స్పష్టం చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ డేటాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం అందజేసింది. తాజాగా దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి ఎస్​బీఐ అఫిడవిట్‌ సమర్పించింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 మధ్య కొనుగోలు చేసిన, రిడీమ్ చేసిన ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన డేటాను ఈసీకి అందించినట్లు తెలిపింది. 2019 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు మొత్తం 22,217 ఎన్నికల బాండ్లను దాతలు కొనుగోలు చేసినట్లు ఎస్‌బీఐ తమ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇందులో 22,030 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్‌ చేసుకుని నిధులు తీసుకున్నట్లు తెలిపింది. మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రిడీమ్‌ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డబ్బు జమ చేసినట్లు వెల్లడించింది.

అయితే వీటితో ఏ పార్టీకి ఎన్ని నిధులు దక్కాయన్నదానిపై ప్రస్తుతానికి పూర్తి స్పష్టత లేదు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్‌బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల నెంబర్లు లేకపోతే ఎవరు ఎంత ఇచ్చారన్నది ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. అన్ని వివరాలను వెల్లడించాలని తాము స్పష్టమైన తీర్పు చెప్పినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. దీనికి సమాధానం ఇవ్వాలంటూ ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. అన్ని వివరాలతో ఎన్నికల కమిషన్ కు సోమవారం నాటికి అందచేయాలని పేర్కొంది.



Tags

Read MoreRead Less
Next Story