Uttar Pradesh: మాక్కొంచం తిక్కుంది

Uttar Pradesh: మాక్కొంచం తిక్కుంది
సెల్ఫీకి ప్రయత్నించిన వారిని వెంటబెట్టిన ఏనుగుల మంద

యూ పీ లఖింపూర్ ఖేరీలోని దుధ్వా టైగర్ రిజర్వ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఏనుగుల గుంపుతో సెల్ఫీ దిగేందుకు వెళ్లిన ముగ్గురు యువకులకు ఊహించని అనుభవం ఎదురైంది. తిక్కరేగిన ఏనుగుల గుంపు వారి వెంట పడ్డాయి. దీంతో వారు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని కిందమీద పడుతూ పరుగు పెట్టారు.

ఒక్కోసారి మనం చేసే పనులు మనల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. ప్రాణాల మీదకి తెస్తాయి. ముఖ్యంగా సెల్ఫీ వీడియోలు, ఫోటోలు తీసుకునేటప్పుడు ఆ పని ఎంత ముఖ్యమో, ప్రాణం అంతకంటే కూడా ముఖ్యమైనది అన్న విషయం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ, ఏ సందర్భంలో, ఎవరితో తీసుకోవాలనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. కొందరు సెల్ఫీల కోసం ప్రాణాంతక సాహసాలు కూడా చేస్తుంటారు. జంతువులతో ఫోటోలు వీడియోలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనలాగే వాటికి కూడా ఒక్కోసారి తిక్క పుడుతుంది కాబట్టి.

ముగ్గురు వ్యక్తులు ఉత్తర ప్రదేశ్ నుంచి నేపాల్ వెళ్తున్నారు. వారికి దారి మధ్యలో దూధ్వ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వచ్చింది. అక్కడ ఓ ఏనుగుల గుంపు కనిపించింది. ఇంకేముంది ఉత్సాహంతో వాటితో సెల్ఫీలు దిగుదామని రెడీ అయ్యారు. వాటికి మండినట్టు ఉంది. ఆ ముగ్గురిని వెంటపడి పరుగులు పెట్టించాయి.

ఇందుకు సంబంధించిన ఓ క్లిప్‌ ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు. దాదాపు 50 ఏనుగుల గుంపు రోడ్డును ఆక్రమించిన పాలియా గౌరీఫాంట రహదారి దృశ్యం అని క్యాప్షన్ పెట్టారు. 10 సెకన్ల నిడివి గల వీడియోలో ముగ్గురు వ్యక్తులను కొన్ని ఏనుగులు వెంబడిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పరిగెత్తుతున్న క్రమంలో ఓ యువకుడు కింద పడిపోయాడు. కానీ మళ్లీ లేచి పరుగు ప్రారంభించాడు. ఏనుగులు ముగ్గురు యువకులను వెంబడించగా, అక్కడికక్కడే ఉన్న ఓ యువకుడు ఈ ఘటనను కెమెరాలో బంధించాడు. అయితే, వైరల్ వీడియోను దుధ్వా టైగర్ రిజర్వ్ అధికారులు ధృవీకరించలేదు.

నిజానికి ఇలాంటి ప్రదేశాలలో పర్యటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తరచూ చెబుతూనే ఉంటారు. అడవి జంతువులను సమీపించే ప్రయత్నం చేస్తే అవి దాడి చేస్తాయని హెచ్చరిస్తుంటారు. కానీ కొందరు అనవసర సాహసాలకు పోయి ఊహించని ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ వీడియో చూసినవాళ్లు కూడా ఇలాగే స్పందిస్తున్నారు. ఎంత తమాషాగా కనిపించినా ఇది నిజం గా రిస్క్ అని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story