Uttarakhand Tunnel సొరంగ నిర్మాణంలో ఎస్కేప్ రూట్ ఎక్కడ?

Uttarakhand Tunnel   సొరంగ నిర్మాణంలో ఎస్కేప్ రూట్ ఎక్కడ?
రెస్క్యూలో విఫలమైన మూడు ప్రయత్నాలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో గత ఆదివారం కుప్పకూలిన సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొలుత వీరిని బయటికి తీసేందుకు ఓ డ్రిల్లింగ్‌ యంత్రంతో రెస్యూ నిర్వహించారు. అది నెమ్మదిగా పనిచేస్తుండటంతో అమెరికాకు చెందిన ఆగర్‌ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని ప్రత్యేకంగా వాయుసేన విమానాల్లో తరలించారు. దాంతో డ్రిల్లింగ్‌ పూర్తిచేసి పైపులైను ద్వారా కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావాలని భావించారు. కానీ, ఆ ఆశలూ ఫలించలేదు. ఐదో పైపును అమరుస్తున్న సమయంలో పెద్దగా పగుళ్లు వచ్చి, భారీ శబ్దం వినిపించింది. దీంతో ఆగర్‌తో డ్రిల్లింగ్ నిలిపివేశారు.

ఉత్తరాఖండ్‌ ఉత్తర్‌కాశీలోని సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల వెలికితీతకు యత్నాలు జరుగుతుండగా, ఈ ప్రమాదం అనంతరం ప్రభుత్వం చేసిన ఒక ఘోర తప్పిదం బయటపడింది. ప్రమాదాలు చోటుచేసుకుంటే వాటి నుంచి తప్పించుకునేందుకు ఎస్కేప్‌ రూట్‌ను కూడా ప్లాన్‌లో సిద్ధం చేస్తారు. అయితే 4.5 కి.మీ పొడవున్న ఈ సొరంగానికి కూడా అలాంటి మార్గాన్ని ప్లాన్‌లో రూపొందించినా దానిని చేపట్టిన కంపెనీ దానిని నిర్మించలేదు. తప్పించుకొనే మార్గం నిర్మించి ఉంటే కార్మికులకు ఈ దుస్థితి వచ్చేది కాదని బాధిత కుటుంబ సభ్యులు, పలువురు నేతలు విమర్శిస్తున్నారు.


ఇదిలా ఉండగా, సొరంగ నిర్మాణంలో కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యం బయటపడింది. నిర్మాణ సంస్థ తీవ్రమైన లోపాన్ని సూచించే మ్యాప్ బయటకు వచ్చింది. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం.. 3 కి.మీ పొడవున్న అన్ని సొరంగాలు విపత్తు సంభవించినప్పుడు ప్రజలను రక్షించడానికి తప్పించుకునే మార్గాన్ని కలిగి ఉండాలి. 4.5 కి.మీ సిల్క్‌యారా సొరంగంలోనూ ఈ మార్గం ప్లాన్ చేసినా కానీ అమలు చేయలేదని మ్యాప్ రుజువు చేస్తుంది. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడానికి సహాయ బృందాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి.

సొరంగం లో ఉన్న 40 మందిలో 15 మంది జార్ఖండ్‌, 8 మంది ఉత్తరప్రదేశ్, ఐదుగురు ఒడిశా, నలుగురు బిహార్, ముగ్గురు బెంగాల్, ఇద్దరు అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టన్నెల్‌‌లో నీటి సరఫరాకు గతంలోనే పైప్‌లైన్ వేశారు. ఇపుడు సొరంగంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్, ఆహారం (డ్రై ఫ్రూట్స్, బాదం) నీరు దీని ద్వారానే సరఫరా చేస్తున్నారు. కార్మికులకు జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులకు సంబంధించిన మందులను కూడా పైపుల ద్వారా పంపినట్లు అధికారులు చెబుతున్నారు


Tags

Read MoreRead Less
Next Story