Excise Case: మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ... బెయిల్‌ తిరస్కరణ

Excise Case: మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ... బెయిల్‌ తిరస్కరణ
సీఎం మనీష్ సిసోడియాకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ... బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

మద్యం పాలసీ కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మరోసారి తిరస్కరించింది. బెయిల్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరించడంతో... కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మనీష్‌ సిసోడియా హైకోర్టును ఆశ్రయించారు. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. గతంలోనూ పలుమార్లు సిసోడియా బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయనతోపాటు ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయిన్‌పల్లి అభిషేక్, లిక్కర్ కంపెనీ మేనేజర్ బినోయ్ బాబు బెయిల్ పిటిషన్‌లను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.


మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని... అందుకే బెయిల్‌ను తిరస్కరిస్తు‌న్నామని జస్టిస్ దినేష్ కుమార్ శర్మ బెంచ్ వ్యాఖ్యానించింది. బెయిల్‌ రద్దు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగానే ఉందని కోర్టు అభిప్రాయపడింది. సిసోడియా శక్తివంతమైన వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఆరోపణల తీవ్రత, నేరపూరిత కుట్రలో సిసోడియా పాత్రపై ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.

ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఆరు నెలల తర్వాత ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను తొలిసారిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI అరెస్టు చేసింది. తీహార్ జైలులో గంటల తరబడి విచారించిన తర్వాత మార్చి 9న సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని ఆప్ ప్రభుత్వం నవంబర్ 2021 సెప్టెంబర్‌ 17న అమలులోకి తెచ్చింది. అవినీతి ఆరోపణల మధ్య గత ఏడాది సెప్టెంబర్ చివరిలో దీన్ని రద్దు చేశారు. ఈ వ్యవహారంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన కేసుల్లో మనీష్‌ సిసోడియా నిందితుడిగా ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story