బీహార్ లో తలకిందులైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

బీహార్ లో తలకిందులైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందలు చేస్తూ బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఎన్నికల ఫలితాల సరళిని..

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందలు చేస్తూ బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీఏ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఎన్నికల ఫలితాల సరళిని పరిశీలిస్తే బీజేపీ, జేడీయూ కూటమికి అత్యధిక స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ అయిన 122 స్థానాలను దాటి 130కు పైగా స్థానాల్లో ఆ కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే తుది ఫలితం ఇంకా ఖరారు కానప్పటికీ అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉండడంతో గెలుపుపై బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు.

మరో వైపు ఆర్జేడీ యువకిరణం తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాగట్ బంధన్ 108 చోట్ల ఆధిక్యంలో ఉంది. అనుభవశాలి అయిన నితీష్‌ కుమార్ కు తేజస్వి ముచ్చెమటలు పట్టించాడు. ఎన్నికల ప్రచారం చివరిరోజు ఏకంగా 19 సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాడు. కానీ ప్రధాని మోదీ హవా ముందు నిలబడలేకపోయాడు. అయినా కానీ కొద్దిపాటి స్థానాల్లోనే వెనుకంజ వేశాడు.

ఇక నితీష్‌కుమార్‌ టార్గెట్ గా రంగంలో దిగిన లోక్ జనశక్తి పార్టీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే లీడింగ్‌లో ఉంది. మాజీ కేంద్ర మంత్రి అయిన రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత... కొడుకు చిరాగ్‌ పాశ్వాన్‌ అంతా తానై పార్టీని ముందుకు నడిపించాడు. గత ఎన్నికల్లో 2 సీట్లు సాధించగా.. ఈ సారి ఆ ప్రభావం కూడా.. LJP చూపించలేకపోయింది.

ఉదయం కౌంటింగ్‌ మొదలైనపుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మహాగట్ బంధన్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. కానీ... ఆ తర్వాత క్రమంగా ఎన్డీయే పుంజుకుని సునాయాసంగా మేజిక్ ఫిగర్‌ 122 మార్క్‌ను దాటి స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతోంది. పార్టీల పరంగా చూస్తే... 80 చోట్ల లీడింగ్‌తో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. జేడీయూ 46 చోట్ల లీడింగ్‌లో ఉంది. మహాగట్‌బంధన్‌లోని ఆర్జేడీ 69 స్థానాల్లో... కాంగ్రెస్‌ 20 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. వామపక్ష అభ్యర్థులు 18 చోట్ల దూసుకుపోతున్నాయి. ఇతరులు మరో పదిచోట్ల ముందంజలో ఉన్నారు.

ఫలితాల సరళి చూస్తుంటే మహాగట్ బంధన్ లో నితీష్ కు సరితూగే నాయకుడు లేకపోవడం ఎన్డీఏకు కలిసివచ్చింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తేజస్వి యాదవ్ ఒక్కడే శ్రమించాడు. అయితే తేజస్వి యువకుడు కావడం, తండ్రి లాలూ కాలం నాటి జంగిల్‌ రాజ్‌ ప్రజలు మరచిపోకపోవడం వంటి అంశాలు కూడా దెబ్బకొట్టాయి.

Tags

Read MoreRead Less
Next Story