నకిలీ పాస్​పోర్ట్​ స్కామ్​లో ఇంటిదొంగలలు

నకిలీ పాస్​పోర్ట్​ స్కామ్​లో ఇంటిదొంగలలు
సీఐడీకి చిక్కి

శ్రీలంకసహా ఇతర దేశాలకు చెందిన వారికి నకిలీ డాక్యుమెంట్లతో భారత పాస్‌పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా పోలీసు శాఖకు చెందిన ముగ్గురినిCID అధికారులు అరెస్ట్ చేశారు. గతేడాది హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న సమయంలో నకిలీ పాస్‌పోర్టు ముఠాకు ఈ ముగ్గురు సహకరించినట్లు తేలింది. పంజాగుట్ట SB విభాగంలో పనిచేసి.. ప్రస్తుతం షీటీంలో ASIగా ఉన్న గుంటూరు వెంకటేశ్వర్లు, మారేడ్‌పల్లి ట్రాఫిక్ ASI తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ ASI షేక్ నజీర్ బాషను సీఐడీ అరెస్ట్ చేసింది. వీరితోపాటు SRనగర్ లోని ఆధార్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు కొప్పిశెట్టి కల్యాణ్‌ను కూడా CID రిమాండ్‌కు తరలించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నిందితుల సంఖ్య 22కు చేరింది.

హైదరాబాద్ నాంపల్లిలోని రెడ్‌ హిల్స్ బడీమసీద్‌కు చెందిన అబ్దుస్ సత్తార్ జవహరీ.. ప్రధాన సూత్రధారిగా సాగిన బోగస్ పాస్‌పోర్టుల వ్యవహారం జనవరిలో వెలుగుచూసింది. అప్పట్లోనే ఇద్దరు SB సిబ్బంది సహా 12మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. సత్తార్ ముఠాకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ SB సిబ్బందిని మచ్చిక చేసుకొని దందా సాగించారు. హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏజెంట్లు ఎక్కువగా ఈ ఘనకార్యాలకు పాల్పడ్డారు. ఒక్కో పాస్‌పోర్టు విచారణ కోసం SB సిబ్బందికి వేలల్లో ముట్టజెప్పి పని కానిచ్చారు. విద్యార్హత, ఆధార్ తరహా గుర్తింపు పత్రాలు అన్నీ బోగస్‌వే అయినా సత్తార్ ముఠా మాయలో పడిన SB సిబ్బంది.. గుర్తించలేకపోయారు.

సత్తార్ ముఠా ఇప్పటివరకు 95 మంది శ్రీలంక శరణార్థులతోపాటు మరో 30 మంది ఇతర దేశస్థులకు బోగస్ పత్రాలతో భారత పాస్‌పోర్టులు ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. కాగా వారి సమాచారాన్ని, పాస్‌పోర్టులను ఇమ్మిగ్రేషన్ అధికారులకు పంపించారు. సీఐడీ దర్యాప్తు క్రమంలో సత్తార్ ముఠాపై గతంలో ఇదే తరహా కేసులున్నట్లు తేలింది. తొలుత నాంపల్లిలో గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ పని చేసిన సత్తార్.. సులభంగా డబ్బు సంపాదించేందుకు 2011లో నకిలీపత్రాలు సృష్టించే దందాకు తెరలేపాడు. చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు బ్రోకర్‌తో పరిచయం ఏర్పర్చుకుని.. నకిలీ పత్రాలు సృష్టించినందుకు 75వేలు ముట్టజెప్పేవాడు. ఎస్బీ సిబ్బంది.. డబ్బు ఆశతో సత్తార్‌కు సహకరించారు. కాగా ఈకేసులో అరెస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story