ఎముకలు కొరికే చలిలోనూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు

ఎముకలు కొరికే చలిలోనూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు

ప్రతీకాత్మక చిత్రం 

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టుదలతో ఉన్న రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎముకలు కొరికే చలిలోనూ ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపైనే నిరసనలు తెలుపుతున్నారు. అక్కడే వండుకుని.. ఆందళనలు చేస్తున్నారు. ఓ వైపు చట్టాల సవరణకు సిద్ధమని కేంద్రం చెబుతున్నా...అన్నదాతలు ససేమిరా అంటున్నారు. వరుసగా నాలుగు రౌండ్‌ చర్చల్లోనూ ఫలితం తేలలేదు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో నిన్న సుమారు 8 గంటలపాటు ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు.

35 రైతు సంఘాల నేతలు తమ అభ్యంతరాలను కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌కు వినిపించారు. అయితే మూడు చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను కేంద్ర అంగీకరించలేదు. మూడు చట్టాల్లోని అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి సమాచారంతో వివరణ ఇచ్చింది. కేంద్రం వివరణను రైతు నాయకులు తిరస్కరించారు. చట్టాల్లో చాలా లొసుగులు, లోపాలు ఉన్నాయని రైతులు తమ వాదన వినిపించారు. ఈ అంశంపై నిర్ణయం తేలకపోవడంతో రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రతినిధులు శనివారం మరోమారు భేటీ కానున్నారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ప్రభుత్వంతో నిన్న జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో... రైతుల సంఘాల నేతలు ఈరోజు సింఘులో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో రేపటి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అటు.. ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు నిరసన కొనసాగిస్తున్నారు. వరుసగా 9వ రోజు ఢిల్లీ-హర్యానా మార్గంలోని సింఘు, టిక్రి రహదారులపై బైఠాయించిన రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసుల మోహరించారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు పెరిగాయి. ఈ రోజు కూడా సింఘు, టిక్రి, లాంపూర్‌, సఫియాబాద్‌, సబోలి తదితర సరిహద్దులను పోలీసులు మూసివేశారు. 44వ జాతీయ రహదారికి రెండువైపులా రాకపోకలను నిషేధించారు. ఝతికరా సరిహద్దులో కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి కల్పించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలతో దూరం పెరిగి, రద్దీ కూడా విపరీతంగా ఉంటుండటంతో ఢిల్లీలో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఢిల్లీ-యూపీ మార్గాన్ని కూడా రైతులు నిర్బంధించారు. మరోవైపు రైతుల ఆందోళనకు పలు సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయి. అన్నదాతలకు తమ మద్దతు తెలిపిన ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ నేడు ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story