Farmers Protest: రైతుల కీలక నిర్ణయం ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ రెండు రోజులు వాయిదా..

Farmers Protest:  రైతుల కీలక నిర్ణయం ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌ రెండు రోజులు వాయిదా..
పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ నేపథ్యంలో నిర్ణయం

రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చలో ఢిల్లీ నిరసనను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. రేపు సాయంత్రం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నాయి. శంభు, ఖనౌరీ శిబిరాల్లోనే రైతులు నిరసన తెలపనున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు.

పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించిన క్రమంలో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఖనౌరి సరిహద్దు వద్ద ఘర్షణల్లో ఒక యువ రైతు మరణించాడు. ఈ క్రమంలో మార్చ్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణపై శుక్రవారం సాయంత్రం నిర్ణయాన్ని వెలువరిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ బుధవారం సాయంత్రం పేర్కొన్నారు. అయితే శంభు, ఖనౌరి సరిహద్దుల్లో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఎంఎస్పీ విషయంలో కేంద్రం చేసిన ‘ఐదేండ్ల ఒప్పందం’ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ‘ఢిల్లీ చలో’ ఆందోళనను బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించారు. శంభు, ఖనౌరి సరిహద్దుల నుంచి ఢిల్లీ వైపుగా సాగేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులను అడ్డుకొనేందుకు పోలీసులు రెండు ప్రాంతాల్లో పలు రౌండ్ల బాష్పవాయువు ప్రయోగించారు.


ఘర్షణల్లో 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని హర్యానా పోలీసులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిని చుట్టుముట్టిన ఆందోళనకారులు.. పంట వ్యర్థాలను తగలబెట్టి, అందులో కారం పొడి వేశారని ఆరోపించారు. శంభు, ఖనౌరి సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రైతులు తమ ట్రాక్టర్‌ ట్రాలీలు, మినీ వ్యాన్లు, ఇతర వాహనాలతో నిలిచిపోయారు. వీటితోపాటుగా ఆందోళన ప్రాంతాల్లో ఎర్త్‌ మూవర్లు, పొక్లెయిన్లు, జేసీబీలు మాడిఫైడ్‌ ట్రాక్టర్లు కూడా కనిపించాయి. వీటితో రైతులు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు అవకాశం ఉన్నదని, భద్రతా సిబ్బందికి హాని కలుగుతుందని హర్యానా పోలీసులు పేర్కొన్నారు. మిషనరీని సంబంధిత యజమానులు వెనక్కు తీసుకుపోవాలని, లేకుంటే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story