వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా భగ్గుమన్న రైతు సంఘాలు..

వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా భగ్గుమన్న రైతు సంఘాలు..
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి చట్టం రూపం దాల్చితే..

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా రైతు సంఘాలు భగ్గుమంటున్నాయి. బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి చట్టం రూపం దాల్చితే.. అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గళమెత్తుతున్నాయి. దళారులు, కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టేందుకే కేంద్రం ఈ బిల్లులను తీసుకొస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఈ బిల్లులను పార్లమెంట్‌లో విపక్షాలు వ్యతిరేకించగా.. ఇప్పుడు రైతులు ఆందోళన బాటపట్టారు. కేంద్రం దిగొచ్చే వరకు.. పోరాటం చేయాలని నిర్ణయించాయి. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇవాళ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. దేశంలోని అన్ని రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. అఖిల భారత రైతు సమాఖ్య , భారతీయ కిసాన్‌ యూనియన్‌ , ఆలిండియా కిసాన్‌ మహాసంఘ్‌ వంటి రైతు సంఘాలు దేశవ్యాప్త బంద్‌లో పాల్గొంటున్నాయి.

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. పంజాబ్‌లో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. మూడు రోజుల రైల్‌రోకో కార్యక్రమం కొనసాగుతోంది. రైతులు అనేక చోట్ల పట్టాలపైనే కూర్చుంటున్నారు. బిల్లులను వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంజాబ్‌లో పలు ప్రత్యేక రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా రద్దుచేశారు. రైల్‌రోకో కారణంగా ఆహారధాన్యాల రవాణాపై ప్రభావం పడుతోందంటున్నారు అధికారులు.

రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు ప్రతిపక్ష పార్టీల నుంచి వివిధ రాజకీయ పార్టీల మద్దతు లభిస్తోంది. వ్యవసాయ, కార్మిక సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలను ప్రారంభించింది. ఈ నిరసన కార్యక్రమాలను రెండు నెలలపాటు నిర్వహిస్తామని చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ రైతులను, కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యవసాయ, కార్మిక బిల్లులను వ్యతిరేకిస్తూ ఉత్తర్‌ప్రదేశ్‌ అంతటా నిరసనలు నిర్వహించాలని సమాజ్‌వాదీ పార్టీ నిర్ణయించింది. రైతుల ఆందోళన నేపథ్యంలో డిల్లీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేసి.. రోడ్లపై ఆంక్షలు పెట్టారు.

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసమే బిల్లులు తెచ్చామని ఇప్పటికే ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ బిల్లుల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగదన్నారు. పంటలకు మద్ధతు ధర కొనసాగుతుందని హామీ ఇచ్చినా.. రైతులు మాత్రం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ బిల్లులను ఒప్పుకునేది లేదని తేల్చిచెబుతున్నారు. ఆందోళన నేపథ్యంలో.. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటించారు. వ్యవసాయ రంగంలో మార్పులు తెస్తామంటూ కాంగ్రెస్‌ కూడా 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రైతులు ఎక్కడైనా స్వేచ్ఛగా తమ పంట ఉత్పత్తుల్ని విక్రయించేందుకు ఇకపై వీలుంటుందని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story