Karpuri Thakur : ఎవరీ కర్పూరీ ఠాకూర్‌?ఎందుకు భారతరత్న? వివరాలివే

Karpuri Thakur :  ఎవరీ  కర్పూరీ ఠాకూర్‌?ఎందుకు    భారతరత్న? వివరాలివే
శతజయంతి సందర్భగా అత్యున్నత పురస్కారం

దివంగత నేత, బీహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ ను దేశ అత్యున్నత పురష్కారం వరించింది.ఆయన శత జయంతి వేళ దేశ అత్యున్నత పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్టు మంగళవారం రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయం కోసం కర్పూరీ ఠాకూర్‌ చేసిన కృషికి గుర్తుగా ఆయనకు ఆ పురస్కారం ఇస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది.

1970వ దశకంలో రెండు సార్లు బీహార్‌ సీఎంగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్‌.. జన నాయక్‌(జననేత)గా గుర్తింపుపొందారు. రాజకీయంగా అగ్రకులాలు ఆధిపత్యం వహించే బీహార్‌లో ఓబీసీల రాజకీయాలకు ఆయన నాంది పలికారు. మొదటిసారిగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ యేతర సోషలిస్టు నాయకుడు కూడా కర్పూరి ఠాకూరే కావడం విశేషం. భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న గ్రహీతల్లో ఠాకూర్‌ 49వ వ్యక్తి. చివరిసారిగా కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి, దివంగత ప్రణబ్‌ ముఖర్జీకి 2019లో ఈ పురస్కారాన్ని ప్రకటించింది.


కర్పూరి ఠాకూర్ 1924 జనవరి 24న బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో జన్మించారు. మంగలి కుటుంబానికి చెందిన ఆయన తండ్రి గోకుల్ ఠాకూర్ రైతు. కర్పూరి ఠాకూర్ తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే అభ్యసించారు. తరువాత పాట్నా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యారు. విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

కర్పూరి ఠాకూర్ విద్యార్థి దశ నుంచే జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 26 నెలలు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో కర్పూరీ ఠాకూర్ మొదటిసారిగా బీహార్ శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. సోషలిస్టు పార్టీ టిక్కెట్‌పై తాజ్‌పురి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు శాసన సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1967లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోసారి 1970లో కర్పూరీ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. పేదలు, దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కర్పూరీ ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీహార్‌లో తొలిసారిగా లాభాపేక్షలేని భూములపై ​​రెవెన్యూ పన్నును రద్దు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా కర్పూరి ఠాకూర్‌కే చెందుతుంది. భారతీయ క్రాంతిదళ్‌, జనతా పార్టీకి ఆయన సేవలందించారు. లాలూయాదవ్‌, నితీష్‌కుమార్‌, రాం విలాస్‌ పాశ్వాన్‌కు కర్పూరి ఠాకూర్‌ రాజకీయ గురువు. కర్పూరి ఠాకూర్‌ 1988, ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు.

Tags

Read MoreRead Less
Next Story