Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై కీలక అప్‌డేట్

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలపై కీలక అప్‌డేట్
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి,

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం-EC ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఒడిశాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను రాజీవ్ కుమార్ ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని చెప్పిన ఆయన ఎన్నికల వేళ నగదు ప్రవాహం, హింసకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ పూర్తయ్యాక ఈవీఎంలను పక్కాగా సీల్‌ చేసి, గోదాములకు తరలించి మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని రాజీవ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు.

లోక్‌సభతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల నుంచి చేరికలు, ఎన్నికల ప్రచారాలు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలతో దేశంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే ఎన్నికల షెడ్యూల్ కోసం దేశ ప్రజలతోపాటు పార్టీలన్నీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. కీలక ప్రకటన చేసింది. లోక్‌సభతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తాజాగా స్పష్టం చేశారు.

ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో పరిశీలన పూర్తైందని.. ఎన్నికల కోసం అధికారులను సిద్ధం చేశామని తెలిపారు. ఈవీఎంలు అన్నింటినీ తనిఖీ చేసి.. పోలింగ్ కోసం రెడీ చేసినట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని.. ఈ 2 ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రత విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఇప్పటికే సమీక్షలు నిర్వహించి.. సూచనలు, సలహాలు ఇచ్చామని తెలిపారు.

ఎన్నికల వేళ ఉండే డబ్బు ప్రభావాన్ని తగ్గించేందుకు నిరంతరం తనిఖీలు చేస్తున్నామని.. ప్రత్యేక సిబ్బందితో సోదాలు, దాడులు చేస్తున్నట్లు వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొరికిన డబ్బు చూస్తేనే ఏ స్థాయిలో తనిఖీలు చేపట్టామో అర్థం అవుతుందని తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు నిర్వహించటానికి సర్వం సిద్ధం చేశామని.. షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే ఏ ఏ తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story