Gaganyaan: గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం సక్సెస్

Gaganyaan: గగన్ యాన్ టీవీ డీ 1 ప్రయోగం సక్సెస్
17 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి, సేఫ్ గా సముద్రంలో ల్యాండింగ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజెక్టులో తొలి అడుగు పెడింది. ఇస్రో తొలి పరీక్ష ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’TV D1b ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షానికి వ్యోమగాములను పంపి.. తిరిగి సురక్షితంగా భూమిపైకి తెచ్చే క్రూ మాడ్యూల్‌ను వాహకనౌక ద్వారా ప్రయోగించి విజయవంతంగా పరీక్షించింది.

ఉదయం పది గంటలకు శ్రీహరికోటలోని షాక్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌ క్రూ మాడ్యూల్‌ పారాచూట్‌ల సాయంతో సురక్షితంగా సముద్రంలో ల్యాండ్‌ అయ్యింది. TV D1 పరీక్ష ద్వారా వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ సమర్థతను ఇస్రో నిరంతరం విశ్లేషించనుంది. రాకెట్‌ నింగిలోకి బయల్దేరాక ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్‌ సంకేతం పంపారు. దీంతో రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్‌ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి. దాదాపు 12 కిలోమీటర్ల ఎత్తులో.. క్రూ ఎస్కేప్‌ వ్యవస్థను రాకెట్‌ నుంచి వేరు చేశాయి. 17 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ పరస్పరం విడిపోయాయి. ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్లు విచ్చుకున్నాయి. సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్‌ సురక్షితంగా బంగాళాఖాతంలోదిగింది. గగన్‌యాన్‌లో వ్యోమగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహాక ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు.


టీవీ డీ1 ప్రయోగం విజయవంతమైందని ప్రకటిస్తున్నందకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయోగం ఉద్దేశం గగన్‌యాన్‌లో వ్యోమగాములు తప్పించుకునే వ్యవస్థను పరీక్షించడం. క్రూ ఎస్కేప్‌ మాడ్యూల్‌, క్రూ మాడ్యూల్‌ వాహక నౌక నుంచి విజయవంతంగా విడిపోయాయి. దానికి సమాంతరంగా క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా కిందకి దించేలా పారాచూట్లు విచ్చుకున్నాయి. తర్వాత నిర్దేశించిన వేగంతో క్రూ మాడ్యూల్‌ బంగాళాఖాతంలో దిగింది. ఈ అంత సమాచారం మేం సేకరించాం. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం అంతా అనుకున్న ప్రకారమే పక్కాగా జరిగింది.

గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ తొలి పరీక్ష టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌ టీవీ డీ1 ప్రయోగాన్ని ఇస్రో ఉదయం 8 గంటలకే చేపట్టాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించక వాయిదా పడింది. అనంతరం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ప్రయోగాన్ని వాయిదా వేశారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. అనంతరం ఆ లోపాన్ని వేగంగా గుర్తించి సరిచేశారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు రెండోసారి ప్రయోగాన్ని చేపట్టగా అది విజయవంతమైంది. వ్యోమనౌక తీసుకెళ్లిన క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ బరువు 12.5 టన్నులు కాగా.. క్రూ మాడ్యూల్‌ బరువు 4.5 టన్నులు.


Tags

Read MoreRead Less
Next Story