Birthday Cake : బర్త్‌డే కేక్ తిని బాలిక మృతి కేసు.. నిజం ఏంటంటే

Birthday Cake : బర్త్‌డే కేక్ తిని బాలిక మృతి కేసు.. నిజం ఏంటంటే
దర్యాఫ్తులో బయటపడ్డ నిజం

గత నెల పుట్టినరోజు కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన కేక్ తిని పంజాబ్‌లో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. చిన్నారి తిన్న కేక్‌లో సింథటిక్ స్వీట్నర్ అధిక స్థాయిలో ఉన్నట్టు తాజాగా అధికారులు వెల్లడించారు. మార్చి 24న పటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి కుటుంబసభ్యులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి, ఆన్‌లైన్‌లో కేక్ ఆర్డర్ చేశారు. ఆ కేక్ తిన్న తర్వాత అందరూ అనారోగ్యం బారిపడ్డారు. అస్వస్థతకు గురైన మాన్విని ఆస్పత్రికి తరలించగా.. ఆమెను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఆర్డర్ చేసిన కేక్ నమూనాలను పరీక్షలకు పంపగా.. అందులో ప్రమాదకర పదార్థం సింథటిక్ స్వీట్నర్ ఉన్నట్టు తేలింది.

కేక్ లో ఆర్టిఫిషియల్ స్వీట్ నర్ ”సాచరైన్ ను” అధిక మోతాదులో వాడినట్లు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా ఆహారం, పానీయాలలో దీన్ని తక్కువ మొత్తంలో వాడతారు. అయితే ఆ కేక్ లో ఎక్కువగా వినియోగించారు. దీంతో ఆ కేక్ తిన్నవారంతా అస్వస్థతకు గురయ్యారు. బాలిక మౌన్వి చనిపోయింది. కేక్ తయారు చేసిన బేకరీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ బేకరీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా కూడా విధిస్తామని అధికారులు వెల్లడించారు.

మార్చి 24న మాన్వి బర్త్ డే. దీంతో కుటుంబసభ్యులు స్థానిక బేకరీ నుంచి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి చాక్లెట్ కేక్ తెప్పించారు. కేక్ ఇంటికి రానే వచ్చింది. దీంతో అంతా కలిసి ఎంతో ఆనందంగా మాన్వి బర్త్ డే జరుపుకున్నారు. మాన్వితో కేక్ కట్ చేయించారు. అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కట్ చేసిన కేక్ ని మాన్వికి తినిపించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులు కూడా తిన్నారు. అంతే, కేక్ తిన్న కొన్ని గంటల తర్వాత దారుణం జరిగింది. కుటుంబసభ్యులు అందరూ అస్వస్థతకు గురయ్యారు. మాన్వి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

మాన్వి, ఆమె సోదరి వాంతులు చేసుకున్నారు. తన నోరు పొడిబారుతోందని మాన్వి ఏడ్చేసింది. చూస్తుండగానే కళ్ల ముందే మాన్వి తుదిశ్వాస విడిచింది. వెంటనే కుటుంసభ్యులు మాన్విని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఆక్సిజన్ అందించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మాన్వి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, కేక్ లో విష పదార్ధాలు ఉన్నాయని, దాని వల్లే ఇలా జరిగిందని మాన్వి కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. కేక్ శాంపుల్స్ ను టెస్టుల నిమిత్తం ల్యాబ్ కి పంపారు. చివరికి ల్యాబ్ రిపోర్టు రానే వచ్చింది. కేక్ లో అధిక మోతాదులో సింథటిక్ స్వీట్నర్ కలపడం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది. తీపి రుచి కలిగిన సింథటిక్ స్వీట్నర్ ను ఆహారం, పానీయాల తయారీలో తక్కువ మొత్తంలో వాడతారు. సాచరిన్ సాధారణంగా చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది. అయితే, మోతాదుకు మించి వినియోగిస్తే ప్రమాదకరంగా మారుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. తీవ్రమైన కడుపు నొప్పిని కలిగిస్తుంది. తద్వారా మరణం సంభవించే ప్రమాదం ఉంది.



Tags

Read MoreRead Less
Next Story