శవాలతో బేరం..ఒడిశా రైలు ప్రమాదంలో దురాశపరుల నిర్వాకం

శవాలతో బేరం..ఒడిశా రైలు ప్రమాదంలో దురాశపరుల నిర్వాకం
అనేక మృతదేహాలను గుర్తించకపోవడం... కొందరు దురాశపరులకు ఇది వరంగా మారింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని.... పరిహారం సొమ్ములు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒడిశా ఘోర రైలు ప్రమాదం వందలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. దుర్ఘటన జరిగిన ఆరురోజులైన అనేక మృతదేహాలను గుర్తించలేదు. గుర్తించని మృతదేహాల నుంచి అధికారులు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నారు. ఇందుకోసం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగి ఆరు రోజులు గడిచినా, 83 మృతదేహాలు ఎవరివో ఇప్పటికీ తేలలేదు. ఇవి మార్చురీలోనే మగ్గిపోతున్నాయి. దాదాపు అన్నీ కుళ్లిపోయి గుర్తుపట్టేందుకు వీల్లేని విధంగా మారిపోయాయి. మృతదేహాలపై ఉన్న దుస్తులు, ఇతర వస్తువులను బట్టి కొన్నింటిని గుర్తిస్తున్నారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. చాలా మృతదేహాలు ఎవరివో తేలక మార్చురీలో పడి ఉండగా, మరికొన్ని శవాలు తమ వారివంటే తమ వారివంటూ రెండు మూడు కుటుంబాలు పట్టుబడుతున్నాయి. ఇది అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది.

అనేక మృతదేహాలను గుర్తించకపోవడం... కొందరు దురాశపరులకు ఇది వరంగా మారింది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుని.... పరిహారం సొమ్ములు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరూ గుర్తించని మృతులను తమ కుటుంబసభ్యులుగా నమ్మించి మృతదేహాలు తీసుకుంటున్నారు. కటక్‌కు చెందిన ఓ మహిళ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం తన భర్త చనిపోయాడంటూ తప్పుడు క్లెయిమ్‌ చేసి ఓ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించి చివరి నిమిషంలో పోలీసులకు చిక్కింది.

ఇలాంటి నయా మోసంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.ఇలాంటి సమస్యలు రాకుండా శవాలతో పాటు, వాటిని క్లెయిమ్‌ చేస్తున్న వారి కుటుంబీకుల నుంచి అధికారులు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నారు. వాటిని ఎయిమ్స్‌లోని డీఎన్‌ఏ పరీక్షా కేంద్రంలో విశ్లేషిస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా డీఎన్‌ఏ నమూనాలు సరిపోల్చి మృతదేహాలు అప్పగించనున్నారు. ఎవరూ క్లెయిమ్‌ చేయని శవాల నుంచి కూడా డీఎన్‌ఏ నమూనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. ఒకట్రెండు రోజుల తర్వాత ఆ మృతదేహాలకు ప్రభుత్వమే అంత్యక్రియలు పూర్తిచేయనుంది. ఆ తర్వాత ఎవరైనా వస్తే వారి డీఎన్‌ఏ నమూనాలు కూడా సేకరించి.. తమ వద్ద ఉన్న నివేదికలతో సరిపోల్చి నిర్ధారించనుంది. ఇంకా మిగిలిపోయిన శవాలను భద్రపరిచేందుకు పారదీప్‌ పోర్టు నుంచి కంటైనర్లను తెప్పించారు.

Tags

Read MoreRead Less
Next Story