Haryana: వాణిజ్య సంస్థల్లో హుక్కా నిషేధం

Haryana: వాణిజ్య సంస్థల్లో హుక్కా నిషేధం
హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లలో నిషేధం

హర్యానా ప్రభుత్వం హుక్కా ప్రియులపై కొరడా ఝళిపించింది. హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లలో ఇకపై హుక్కాను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా అందించడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన చర్య అని అన్నారు. డీ-అడిక్షన్ ప్రచారానికి చేసిన సైక్లోథాన్ ముగింపు కార్యక్రమంలో మనోహర్ ఖట్టర్ ఈ ప్రకటన చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సాంప్రదాయ హుక్కాకు ఈ నిషేధం వర్తించదు. హర్యానాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, బార్‌లు మరియు నైట్‌క్లబ్‌లలో వడ్డించే హుక్కాను నిషేధించాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా డిమాండ్ చేసిన కొన్ని నెలల తర్వాత హర్యానాలో హుక్కా నిషేధం వచ్చింది.


డీ-అడిక్షన్ ప్రచారానికి 25 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సైకిల్‌ తొక్కిన పోలీసులను ప్రశంసిస్తూ.. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో పాల్గొన్న 250 మందికి హర్యానా డీజీపీ నుంచి క్లాస్-1 కమెండేషన్ సర్టిఫికెట్ లభిస్తుందని ఖట్టర్ తెలిపారు. ఇందులో నిమగ్నమైన పోలీసులకు ఐదు రోజుల సెలవులు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. సైక్లోథాన్‌ ముగిసినా డ్రగ్స్‌ బెడద ఇంకా అంతం కాలేదన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సమాజం ఏకం కావాలని ఆయన సమాజ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తును పూర్తిగా నిర్మూలించేందుకు కనీసం ఒక సంవత్సరం పాటు ప్రజా చైతన్య ప్రయత్నాలు కొనసాగించాలని ఆయన కోరారు.


అయితే, హర్యానా ప్రభుత్వ నిషేధం గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సాంప్రదాయ హుక్కాలకు వర్తించదు. ఈ మేరకు సర్కారు ప్రకటించింది. హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా వాణిజ్య సంస్థలు హుక్కా సేవలను నిలిపివేయాలని డిమాండ్ చేసిన కొన్ని నెలల తర్వాత ఈ నిషేధం వచ్చింది.ఈ విషయమై గుప్తా మే నెలలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బార్‌లు, క్లబ్‌లలో హుక్కా తాగడం “బర్నింగ్ ప్రాబ్లమ్” అని స్పీకర్ అభివర్ణించారు. దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్ సెప్టెంబర్ 1న సైక్లోథాన్‌ను ప్రారంభించి సోమవారం (సెప్టెంబర్ 25) ముగించారు. 25 రోజుల పరుగులో సైక్లోథాన్ సుమారు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది.

అటు కర్ణాటక ప్రభుత్వం కూడా హుక్కా బార్‌లను నిషేధించాలని, పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తున్నట్లు వారం క్రితం నివేదిక వెలువడింది.

Tags

Read MoreRead Less
Next Story