hathras : శాంతి భద్రతల నేపథ్యంలోనే రాత్రి అంత్యక్రియలు : యోగి సర్కార్

hathras : శాంతి భద్రతల నేపథ్యంలోనే రాత్రి అంత్యక్రియలు : యోగి సర్కార్
హాథ్రస్ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని..ఈ ఘోరంపై పదేపదే వాదనలు వినాలనుకోవడం లేదని.. దేశ అత్యున్నత..

హాథ్రస్ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమని..ఈ ఘోరంపై పదేపదే వాదనలు వినాలనుకోవడం లేదని.. దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసులో సాక్ష్యులకు ఎలాంటి రక్షణ కల్పిస్తున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు బాధిత కుటుంబం న్యాయవాదిని ఏర్పాటు చేసుకుందా లేదా అని ప్రశ్నించింది. దీనిపై బుధవారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే.. తాము గురువారం అఫిడవిట్‌ దాఖలు చేస్తామని యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది.

అత్యాచార బాధితురాలికి .. అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించడంపై... యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మరుసటి రోజు శాంతి భద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్‌ నివేదిక కారణంగానే.. రాత్రి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని కోర్టుకు తెలిపింది. మరోవైపు హాథ్రస్‌ కేసులో ఎన్నో అవాస్తవ కథనాలు వినిపిస్తున్నాయని.. వాటిని అరికట్టాలని యూపీ తరపున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలాంటివి సృష్టిస్తున్నారని.. ఆయన ఆరోపించారు. బాధిత కుటుంబానికి మొత్తం 15 మంది కానిస్టేబుళ్లతో 24 గంటల పాటు భద్రత కల్పిస్తున్నారన్నారు.

అత్యాచార ఘటనపై విచారణ జరిపేందుకు... సీఎం యోగి నియమించిన ప్రత్యేక సిట్‌ బృందం.. హాథ్రస్‌లో పర్యటించింది. ముగ్గురు సభ్యులున్న ఈ ప్యానెల్‌.. యూపీ హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్‌ నేతృత్వంలో ఏర్పాటైంది. క్రైమ్ సీన్‌ను అధికారులు పరిశీలించారు. ఈ బృందం తన నివేదికను ప్రభుత్వానికి బుధవారం అందజేయనుంది. మరోవైపు హాథ్రస్‌ ఘటనను ఆసరాగా చేసుకొని కొన్ని అరాచక శక్తులు దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. కుల ఘర్షణలు రెచ్చగొట్టేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు పన్నాగం పన్నాయన్నారు. ఇప్పటికే పలువురిపై దేశద్రోహ, అల్లర్లకు కుట్ర కేసులు నమోదు చేశారు పోలీసులు..

హాథ్రస్‌ ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సీరియస్‌ అయ్యారు. నిందితులపై..ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదేంటని ప్రశ్నిస్తుంటే కుట్ర చేస్తున్నామని అంటున్నారని విమర్శంచారు. హాథ్రస్‌ ఘటనను యోగీజీ అంతర్జాతీయ కుట్రలా చూస్తున్నారని.. 19ఏళ్ల యువతి మృగాళ్ల అకృత్యానికి బలైతే దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని దుయ్యబట్టారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్‌ దారుణంలో కొత్త ట్విస్ట్‌ తెర మీదకు వచ్చింది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. బాధితురాలు, ప్రధాన నిందితుడు ఏడాది నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబం, ప్రధాన నిందితుడి సందీప్‌ సింగ్‌ కాల్‌ రికార్డింగులను పరిశీలించారు పోలీసులు. ఈ క్రమంలో బాధితురాలు ప్రధాన నిందితుడితో నిరంతరం ఫోన్‌ టచ్‌లో ఉన్నట్లు వారు గుర్తించారు. బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్‌ నుంచి సందీప్‌కు క్రమం తప్పకుండా కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story