హాథ్రస్‌ యువతిపై అత్యాచారం ఆనవాళ్లేవీ లేవు : ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ

హాథ్రస్‌ యువతిపై అత్యాచారం ఆనవాళ్లేవీ లేవు : ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ
యూపీలోని హథ్రస్‌లో దళిత బాలికపై అత్యాచారం జరగలేదా..? మరి అంత తీవ్రగాయాలు ఎలా అయ్యాయి.. ఆమె మృతికి కారణాలు ఏంటి..? ఫోరెన్స్‌ రిపోర్ట్‌ వాస్తవమేనా..

యూపీలోని హథ్రస్‌లో దళిత బాలికపై అత్యాచారం జరగలేదా..? మరి అంత తీవ్రగాయాలు ఎలా అయ్యాయి.. ఆమె మృతికి కారణాలు ఏంటి..? ఫోరెన్స్‌ రిపోర్ట్‌ వాస్తవమేనా.. ఇంకా ఇలాంటి సందేహాలు ఎన్నో పెరుగుతున్నాయి. దీంతో యూపీలో దళిత బాలిక మృతిపై భగభగలు కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. తమ బిడ్డది హత్యచారమే అని కుటుంబం రోధిస్తోంది.. తమకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఇవాళ కూడా ఆందోళనలకు పిలుపు ఇచ్చాయి వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు.. దీంతో పరిస్థితి కూడా అట్టుడికిపోయింది. అర్ధరాత్రి సమయంలో బాధితురాలి భౌతికకాయానికి పోలీసుల బలవంతపు అంత్యక్రియలు నిర్వహించడంపై సర్వత్రా తీవ్ర నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఈ ఆగ్రహ జ్వాలలు కేవలం యూపీకే పరిమితం కాలేదు.. దేశ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి..

బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకా గాంధీలను గురువారం పోలీసులు అరెస్టు చేయటంతో ఆందోళనలు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రాహుల్‌ను నెట్టేయటంతో ఆయన కిందపడిన దృశ్యాలు టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. మరోవైపున పోలీసులు, జిల్లా అధికారులు తమపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారంటూ బాధిత యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

ఈ హత్యాచార కేసును అలహాబాద్‌ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఏడీజీపీలు ఈ నెల 12న కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీచేసింది. బాధితురాలి మృతదేహానికి హడావుడిగా రాత్రి సమయంలో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చిందని జాతీయ మహిళా కమిషన్‌.. యూపీ డీజీపీని ప్రశ్నించింది. దళిత యువతిపై అత్యాచారం జరగలేదని, తీవ్ర గాయాల కారణంగానే ఆమె చనిపోయిందని ఫోరెన్సిక్‌ నివేదిక వెల్లడించిందని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు పేర్కొన్నారు.

హాథ్రస్‌ యువతిపై అత్యాచారం జరిగిందని నిరూపించే ఆనవాళ్లేవీ లేవని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ తన నివేదికలో పేర్కొందని పోలీస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. మెడపైన, శరీరంపైన తీవ్ర గాయాలే ఆమె మరణానికి కారణమై ఉండవచ్చని నివేదిక వెల్లడిస్తోందన్నారు. బాధిత యువతి కూడా తన మరణ వాంగ్మూలంలో అత్యాచారం గురించి చెప్పలేదని, తనను తీవ్రంగా కొట్టారనే తెలిపారని పోలీసులు అనడాన్ని వివిద సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేసును కావాలనే తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడుతున్నారు. దళితులపై జరుగుతున్న నేరాలను అడ్డుకోవటంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం విఫలమైందని, దానిని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని భీమ్‌ ఆర్మీ డిమాండ్‌ చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story