Monsoon Session: పార్లమెంట్‌ సమావేశాల్లో రెండో రోజూ రసాభాస..

Monsoon Session: పార్లమెంట్‌ సమావేశాల్లో రెండో రోజూ రసాభాస..
ఉభయసభలు సోమవారానికి వాయిదా మణిపూర్‌ హింసపై చర్చకు పట్టుపట్టిన విపక్షాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రెండు రోజు కూడా ఉభయసభలు దద్దరిల్లాయి. మణిపూర్ పరిస్థితిపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు, మే 3 నుంచి కొనసాగుతున్న హింసాకాండపై సమగ్రంగా చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. వారు శాంతించకపోవడంతో లోక్‌సభను స్పీకర్‌ ఓం బిర్లా సోమవారానికి వాయిదా వేశారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను మణిపూర్‌ హింస కుదిపేస్తోంది. మణిపుర్‌లో అల్లర్లు, తాజాగా వెలుగులోకి వచ్చిన మహిళపై అమానుషం ఘటనపై చర్చించాలని విపక్షాలు ఆందోళనలకు దిగాయి.11గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఈ అంశంపై చర్చకు విపక్షాలు సహకరించాలని, దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్‌ ఓం బిర్లా తెలిపారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ప్రధాని మోదీ సభలో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో క్షణాల వ్యవధిలోనే లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభను సోమవారం ఉదయం 11 గంటలకు స్పీకర్‌ వాయిదా వేశారు.

రాజ్యసభలో కొద్ది సేపు సభా కార్యకలాపాలు సాగాయి. అనంతరం మణిపూర్‌ అంశంపై చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సభా కార్యకలాపాలు రద్దు చేసి దీర్ఘకాలిక చర్చ చేపట్టాలని కోరాయి. అయితే దీనిపై స్వల్పకాలిక చర్చకు తాము సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విపక్షాలు అంగీకరించలేదు. ప్రతిపక్ష సభ్యులు సంయమనం పాటించాలని చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ కోరినా వారు శాంతించలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.

మణిపుర్‌ అంశంపై.. రూల్‌ 176 కింద చర్చకు సిద్ధమేనని కేంద్రం చెబుతుంటే.. విపక్షాలు మాత్రం రూల్‌ 267 కింద చర్చకు పట్టుబడుతున్నాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాము రూల్‌ 267 ప్రకారం నోటీసు ఇచ్చాం. పార్లమెంట్‌లో చర్చించాల్సిన ఇతర అంశాలను పక్కనపెట్టి, మణిపూర్‌ ఘటనపై చర్చ జరగాలన్నారు. ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, మణిపూర్ సమస్యపై చర్చ జరపడంపై ప్రతిపక్షాలకు శ్రద్ధ లేదని ఆరోపించారు. ఈ సమస్యపై చర్చించాలని ప్రభుత్వం కూడా కోరుకుంటోందన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారని తెలిపారు. అయినప్పటికీ, ప్రతిపక్షాలు చర్చకు సిద్ధపడటం లేదని, అంటే ఈ సమస్య పట్ల వారికి శ్రద్ధ లేదని స్పష్టమవుతోందని ఆరోపించారు. ప్రస్తుతం మణిపూర్‌లో చాలా సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. అమానవీయ ఘటనకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

మణిపూర్ పరిస్థితిపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ఈ సమస్య గురించి అంతర్జాతీయ వేదికలపై చర్చ జరుగుతోందన్నారు. కానీ మన పార్లమెంటులో మాత్రం చర్చించడం లేదన్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతల గురించి ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. నిర్భయ కేసులో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అప్పటి ప్రభుత్వాన్ని వణికించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే బీజేపీ మొసలికన్నీరు కార్చుతోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story