Heat waves: రానున్న 5 రోజులు మరింత వేడి .. ఆరు రాష్ట్రాల్లో మరీనూ

Heat waves: రానున్న 5 రోజులు మరింత వేడి .. ఆరు రాష్ట్రాల్లో మరీనూ
40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు..

ఉత్తర భారతదేశంలో ప్రచండ భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. వేడిగాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీని నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. రాబోయే 5 రోజుల పాటు తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగుతుందన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాగే, అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

కాగా, రాబోయే 3 రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది అని భారత వాతవరణ శాఖ తెలిపింది. ఇవాళ (మంగళవారం) ఢిల్లీలో పగటిపూట బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. నేడు దేశరాజధానిలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీల నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌లుగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. అయితే, మరో మూడు నాలుగు రోజుల్లో ఢిల్లీలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందన్నారు.

తూర్పు మధ్యప్రదేశ్‌లో ఏప్రిల్ 22 నుంచి రాత్రివేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. రాత్రివేళ అధిక ఉష్ణోగ్రతలను ప్రమాదకర పరిణామంగా భావిస్తారు. ఎందుకంటే.. రాత్రివేళ కూడా వేడి కొనసాగితే శరీరం చల్లబడటానికి అవకాశం ఉండదు. ‘ఆర్బన్‌ హీట్‌ ఐలాండ్‌’ ప్రభావం వల్ల నగరాల్లో ఈ పోకడ ఎక్కువవుతోంది.

అయితే, ఏప్రిల్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలలో నాలుగు నుండి ఎనిమిది రోజుల వరకు వేడి తరంగాలు ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తం ఏప్రిల్-జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల వరకు వేడి గాలులు వీచే అవకాశం ఉంది చెప్పుకొచ్చింది. మైదాన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత కనీసం 40 డిగ్రీల సెల్సియస్‌, తీర ప్రాంతాల్లో 37 డిగ్రీలు, పర్వత ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది వెల్లడించింది. ఇది సాధారణం కంటే కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ అని పేర్కొనింది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన వేడి తరంగాలు వస్తాయని ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story