Hemant Soren: హైకోర్టు జాప్యంపై సుప్రీంకు సోరెన్‌

Hemant Soren: హైకోర్టు జాప్యంపై సుప్రీంకు సోరెన్‌
హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసునా ఫలితం లేదని పిటిషన్

తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నగదు అక్రమ చలామణి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోరెన్‌ను అరెస్టు చేసింది. దీనిపై హైకోర్టు ఫిబ్రవరి 28న తన తీర్పును రిజర్వు చేసిందని అప్పటి నుంచి ఎటువంటి నిర్ణయాన్ని వెలువరించలేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనానికి సోరెన్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ విన్నవించారు. అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2న తాము సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టుకు వెళ్లాలని అప్పట్లో సర్వోన్నత న్యాయస్థానం సూచించిందని వివరించారు. ఆ ప్రకారం ఫిబ్రవరి 4న ఉన్నత న్యాయస్థానానికి వెళ్లామన్నారు. చివరకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో విచారణ జరిపిన కోర్టు ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలిపారు. ఈ పరిస్థితిపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించినా ఎటువంటి ఫలితం కనిపించలేదని సిబల్‌ ధర్మాసనానికి తెలిపారు. ఈ క్రమంలో పిటిషన్‌దారైన హేమంత్‌ సోరెన్‌ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలాగే ఉంటే ఎన్నికలు కూడా అయిపోతాయని, అప్పుడు మేం ఇంకెక్కడికి వెళ్లాలి? అంటూ ఆయన వాపోయారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ ఖన్నా.. వివరాలన్నీ సమర్పించాలని, రేపో, ఎల్లుండో కేసు లిస్టింగ్‌ తేదీని పొందుతారని చెప్పారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేంమంత్ సోరెన్ రాజీనామా చేసి తన వారసుడిగా పార్టీ విధేయుడు, రవాణా మంత్రి చంపయి సోరెన్‌ను ప్రకటించిన అనంతరం జనవరి 31న ఇడి ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో ఏడు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత హేమంత్ సోరెన్‌ను ఇడి అరెస్టు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story