Flash Floods : హిమాచల్, ఉత్తరాఖండ్ వరద మృతులు 81 మంది

Flash Floods :  హిమాచల్, ఉత్తరాఖండ్ వరద మృతులు 81 మంది
సుమారు పదివేల కోట్ల ఆస్తి నష్టం

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 81 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఒక్క హిమాచల్‌లోనే 71 మంది మరణించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. గాయపడిన వారిని రక్షించడానికి, పలుచోట్ల ఇళ్ల శిధిలాలలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీయడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల మనుషులు గల్లంతయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరికొన్ని రోజులపాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.


భారీ వర్షాలకు సిమ్లాతో సహా పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సమ్మర్‌హిల్‌లో ఇప్పటి వరకు 13, ఫాగ్లీలో ఐదు, కృష్ణానగర్‌లో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడతాయనే భయంతో గత 24 గంటల్లో కాంగ్రా జిల్లాలోని ఇండోరా,ఫతేపూర్ సబ్ డివిజన్లలోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 1,731 మందిని రక్షించినట్లు అక్కడి డిప్యూటీ కమిషనర్ తెలిపారు.


వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 24 నుంచి ఇప్పటి వరకు 214 మంది మరణించారు. 38 మంది జాడ తెలియరాలేదు. సమ్మర్ హిల్, కృష్ణా నగర్ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. వాయుసేన హెలికాప్టర్లు, ఆర్మీ సిబ్బంది, ఎన్‌డిఆర్‌ఎఫ్ సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించే ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ రాష్టంలో జులైలో కురిసిన వర్షపాతం 50 ఏళ్ల రికార్డును తిరగరాసింది. ఈ రుతుపవనాల కారణంగా ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి తన రాస్ట్రానికి ఏడాది సమయం, సుమారు రూ. 10,000 కోట్లు సొమ్ము అవసరమని సిఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ఆవేదన వ్యక్తం చేశారు.


అటు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. లక్ష్మణ్ ఝులాలో ఓ రిసార్టుపై కొండచరియలు విరిగిపడడంతో నలుగురు మృతి చెందారు. శిథిలాల నుంచి వారి మృతదేహాలు వెలికితీశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 10కి పెరిగింది. మరోవైపు, మద్మహేశ్వర్ ధామ్‌లో భారీ వర్షాల కారణంగా భారీ ప్రవాహంలో చిక్కుకున్న 293 మందిని రక్షించారు.

పంజాబ్‌లో ఫ్లాష్ ఫ్లడ్స్ వేధిస్తున్నాయి. పోంగ్, భాక్రా డ్యాములు నిండిపోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో హోషియాపూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. అయితే వరద పరిస్థితిని తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story