Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు..

Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలో సమావేశాలు..
పాత పార్లమెంటును ఏం చేస్తారు?

భారత పార్లమెంటరీ ప్రస్థానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పాత పార్లమెంటు భవనం చరిత్ర పుటల్లోకి చేరగా నూతన పార్లమెంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొదట పాత భవనంలోని సెంట్రల్ హాల్ లోప్రధాని మోదీ సహా పలువురు సభ్యులు ఉద్విగ్న ప్రసంగం తర్వాత కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా ఎన్డీఏ కూటమిలోని మిగతా సభ్యులు ఆయన్ను అనుసరించారు. సెంట్రల్ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని కొత్త భవనంలోకి అడుగుపెట్టారు.



సభ్యులకు వినాయక చతుర్ధి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్‌ ఓంబిర్లా ప్రజా సమస్యలను ప్రస్తావించడం ద్వారా పార్లమెంటరీ చర్చలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాలని కోరారు.జాతీయ గీతంతో లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనానికి పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా పేరు పెట్టారు. నవ భారతాన్ని నిర్మించిన నాయకులకు రాజ్యాంగాన్ని అందించిన నేతలకు ఓంబిర్లా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ పార్లమెంటు ఏ ఒక్క పార్టీ ఎదుగుదల కోసం పనిచేయదని, దేశాభివృద్ధే లక్ష్యమని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయడానికి పార్లమెంటు అత్యున్నత ప్రదేశమన్న మోదీ కొత్త భవనంలో మనం ఏం చేసినా అది దేశంలోని ప్రతిపౌరుడికి స్ఫూర్తిగా ఉండాలన్నారు. పలువురు ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాల తరువాత మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి సభ బుధవారానికి వాయిదా వేశారు.

కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్ 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది మే నెల 28 వ తేదీన ప్రధాని మోదీ ఆ భవనాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కొత్త భవనం అత్యంత భద్రత, ఆధునికంగా నిర్మించడమే కాకుండా ఎన్నో విశిష్ఠతలను కలిగి ఉంది. పాత పార్లమెంటు భవనం కంటే ఎంతో పెద్దదైన కొత్త పార్లమెంటులో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు.


పాత పార్లమెంటు భవనాన్ని 1927 లో బ్రిటిష్ వాస్తు శిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి 97 ఏళ్లు నిండాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం పాత భవనాన్ని కూల్చివేయకుండా మరమ్మతులు చేయించి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నారు. ఈ పాత పార్లమెంటు భవనాన్ని పునరుద్ధరించి ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి. భారత పార్లమెంటరీ చరిత్రను దేశ ప్రజలు తెలుసుకునేలా భవనంలోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story