Manipur : మణిపూర్‌లో మరో అలజడి..

Manipur : మణిపూర్‌లో మరో అలజడి..
మయన్మార్ నుంచి రెండు రోజుల్లో 718 మంది ఎంట్రీ

జాతుల మధ్య వైరం కారణంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న మణిపుర్ లో మరో సమస్య మొదలైంది. మయన్మార్ నుంచి 718 మంది అక్రమంగా మణిపుర్ లో ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు, 208 మహిళలు, 209 మంది పురుషులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జులై 22, 23 తేదీల్లో వీరంతా సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మణిపుర్ లో ప్రవేశించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం మణిపూర్ సర్కార్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

వీరందరినీ వెనక్కి పంపేయాలని అస్సాం రైఫిల్స్ కు మణిపుర్ ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయన్మార్ వాసులను మణిపుర్ లోకి అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం రైఫిల్స్ కు తెలియజేసినట్లు మణిపుర్ చీఫ్ సెక్రటరీ డా. వినీత్ జోషి తెలిపారు. మణిపుర్ లో ఆందోళనకారులకు మయన్మార్ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గత నెలలో ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.



ఇలా ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ క్రమంలో మయన్మార్ వాసులు మణిపుర్ లోకి ప్రవేశించడంపై మణిపుర్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మయన్మార్ , మణిపుర్ కు మధ్య 398 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల వద్ద హెలికాప్టర్లతో నిఘా ఉంచుతున్నారు.

మరోవైపు హింసాత్మక ఘర్షణలతో నలిగిపోతున్న మణిపుర్‌లో బాధితులకు సంఘీభావంగా మిజోరాంలో ప్రజలు భారీర్యాలీలు నిర్వహించారు. మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంఘాలు, ఎన్జీవోలు నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో వేలమంది పాల్గొన్నారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా రహదారులపైకి వచ్చి శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. CM జొరమ్‌తంగా, డిప్యూటీ CMతో సహా, అధికార విపక్ష MLAలు ప్రజలతో కలిసి అడుగేశారు. సరిహద్దు రాష్ట్రమైన మణిపుర్‌లో ఘర్షణలు సద్దుమణిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను నిజంగా భారతీయులుగా చూస్తే ఇప్పటికైనా స్పందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్త్రీలను వివస్త్రలు చేసిన నిందితులకు కఠినశిక్ష విధించాలని కోరారు. కాగా మిజోరాంలో ఇటీవలి కాలంలో ఇంతటి భారీ ర్యాలీలు జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించాయి.

Tags

Read MoreRead Less
Next Story