Uttarakhand Tunnel Rescue: చివరి దశకు రెస్క్యూ..

Uttarakhand Tunnel Rescue: చివరి దశకు రెస్క్యూ..
సహాయక చర్యల్లో మరోసారి ఆటంకం

ఉత్తరాఖండ్‌ ప్రమాద ఘటనలో కార్మికులను పైపు గుండా బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైన ట్రయిల్‌ రన్‌ ఎన్డీఆర్‌ఎఫ్‌ విజయవంతంగా పూర్తి చేసింది. పైపులైను గుండా కొద్ది దూరం వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగి తిరిగి మళ్లీ వెనక్కి వచ్చాడు. శిథిలాలను తొలగించి పైపును పంపే పనులు ఇంకా పూర్తికావాల్సి ఉంది. అప్పుడే కార్మికులను బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ జిల్లాలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన ఓ సభ్యుడు చక్రాల ఉన్న స్ట్రెచర్‌పై పడుకొని పైపులో కొద్ది దూరం వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాడు. శిథిలాల గుండా వేసిన 800 మిల్లీ మీటర్ల వ్యాసార్థం కలిగిన పైపులోనికి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ఉద్యోగి గాలి పీల్చడంలో ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు. చక్రాల ఉన్న స్ట్రెచర్‌పైన విడతల వారీగా ఒక్కో కార్మికుడిని బయటకు తీసుకొస్తామని ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు. పైపులో నుంచి కార్మికులను తీసుకొచ్చే సమయంలో వారికి ఎటువంటి గాయాలు కాకూడదనే ఉద్దేశంతోనే స్ట్రెచర్‌లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ప్రమాద ఘటనకు సమీప ప్రాంతంలోనే ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్ ధామి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.


శిథిలాలను తొలగించి, పైపు లైను వేసేందుకు అవసరమైన పనులను సహాయక సిబ్బంది చేపడుతోంది. గురువారం సాయంత్రం డ్రిల్లింగ్‌ చేసే యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు శిథిలాలను తొలగించే పనిని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. మరో 12 నుంచి 14 మీటర్ల మేర శిథిలాలను తొలగించి పైపులైను వేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అన్ని అనుకూలిస్తే మరికొన్ని గంటల్లో ఆపరేషన్ ముగిసే అవకాశం ఉందని అశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చిన కార్మికులను వెంటనే ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా 40 అంబులెన్సులు అందుబాటులో ఉంచారు.

సొరంగం నుంచి కార్మికులను రక్షించి బయటకు తీసుకొచ్చిన వెంటనే బాణాసంచా కాల్చి స్వాగతం పలుకుతామని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీపావళి రోజు నుంచి మొత్తం 41 మంది కూలీలు సొరంగంలో చిక్కుకున్నారని, దీని కారణంగా వారు, వారి కుటుంబాలు, రెస్క్యూలో పాల్గొన్న బృందాలు దీపావళిని జరుపుకోలేదని.. ఈరోజు రెస్క్యూ విజయవంతమైతే దీపావళిని బయట జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రిల్లింగ్‌ పూర్తయితే తాడు, స్ట్రెచర్, ఆక్సిజన్ సిలిండర్‌తో 10 నుంచి 12 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సొరంగం లోపలికి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story