CJI : కింది స్థాయి కోర్టుల్లోనూ అత్యున్నత సాంకేతికత

CJI : కింది స్థాయి కోర్టుల్లోనూ అత్యున్నత సాంకేతికత
ఈ-కోర్టుల ప్రాజెక్ట్ 3వ దశ కోసం భారీగా బడ్జెట్

దేశ అత్యున్నత న్యాయస్థానం మాత్రమే కాదు క్రింది స్థాయి కోర్టులు కూడా ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవల్సిన అవసరం ఉందన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్. సుప్రీం కోర్టులో ఎలాగైతే సాంకేతికను ఉపయోగిస్తున్నారో.. రాబోయే రోజుల్లో కింది స్థాయి కోర్టుల్లో కూడా అలాంటి సాంకేతికను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలను టెక్-ఫ్రెండ్లీగా మార్చాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే కోర్టుల్లో సాంకేతికను మెరుగు పరిచే దిశగా చర్యలు ప్రారంభించామని, ఈ-కోర్టుల ప్రాజెక్ట్ 3వ దశ కోసం భారీగా బడ్జెట్ కేటాయించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతీ రోజు నడపాల్సి వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సాంకేతికతతో న్యాయ వ్యవస్థను మరింత సన్నద్దం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశ కోసం కేంద్రం కేటాయించిన బడ్జెట్‌తో కింది కోర్టుల్లో సాంకేతికత పుంజుకుంటుందని చెప్పారు. న్యాయస్థానాలకు అవసరమైన డిజిటల్ సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా ముఖ్యమైనదని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఈ-కోర్టుల మూడో దశ కోసం కేంద్రం రూ.7వేల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెర్స్ కోసం ఒక స్వంత క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు సీజేఐ తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కీలకమైన విచారణలను లైవ్‌ టెలీకాస్ట్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story