Ayodhya: సందడిగా మారిన లతామంగేష్కర్ చౌక్

Ayodhya: సందడిగా మారిన లతామంగేష్కర్ చౌక్
భారీ వీణను చూసేందుకు బారులు తీరిన సందర్శకులు

జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడి ఐకానిక్ లతా మంగేష్కర్ చౌక్‌ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. 40అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తుతో ఉన్న భారీ వీణను చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్నాపెద్ద అంతా వీణ వద్ద ఫొటోలు దిగుతూ సంబరపడిపోతున్నారు. దీంతో కొన్ని రోజులుగా లతా చౌక్ సెల్ఫీ పాయింట్‌గా మారిపోయింది.

అయోధ్యలో ఈ నెల 22న రామవిగ్రహ ప్రతిష్టాపన జరగనున్న క్రమంలో లతామంగేష్కర్ చౌక్ సందడిగా మారింది. లతా మంగేష్కర్‌కు నివాళిగా గతంలో లాల్‌ చౌక్‌లో ఏర్పాటు చేసిన భారీ వీణ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. అయోధ్య నగరంలోని రామ్ పథ్, ధరమ్ పథ్ కూడలిలో ఉన్న ఈ వీణ వద్దకు పర్యాటకులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యకు తరలివస్తున్న పర్యాటకులు కచ్చితంగా లతా చౌక్‌ వద్దకు వెళ్తున్నారు. చిన్న, పెద్ద అంతా సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. లతా మంగేష్కర్ పాడిన శ్రీరామ సంకీర్తనలను గుర్తు చేసుకుంటున్నారు. వీణను చూసిన వారు అక్కడ ఫొటోలు దిగకుండా ఉండలేరని....అక్కడ ప్లే చేసే లతా మంగేష్కర్ పాటలు ఆమె తమతోనే ఉన్నట్టు అనుభూతిని కలిగిస్తాయని స్థానికులు చెబుతున్నారు.


ప్రముఖ గాయని లతామంగేష్కర్ కు నివాళిగా 2022లో అయోధ్య నగరంలో 40 అడుగుల పొడవు, 12 అడుగులు వెడల్పుతో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభత్వం ఈ వీణను ఏర్పాటు చేసింది. సంప్రదాయ భారతీయ సంగీత వాయిద్యం- వీణపై సరస్వతీ దేవి చిత్రం ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ భారీ వీణను 2022 సెప్టెంబర్ 28న ప్రారంభించారు. ఇటీవల అయోధ్యలో వాల్మీకీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రధాని...... లతా చౌక్‌ను సందర్శించి కొంత సమయం అక్కడే గడిపారు.

Tags

Read MoreRead Less
Next Story