I.N.D.I.A: లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీకి సిద్ధం

I.N.D.I.A: లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీకి సిద్ధం
కీలక నిర్ణయాలు తీసుకున్న విపక్షాల కూటమి, వివిధ కమిటీల ఏర్పాటు

లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల మధ్య ముంబయిలో సమావేశమైన విపక్ష కూటమి ఇండియా....సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయాలని తీర్మానం చేసింది. సెప్టెంబర్‌ 30 నాటికి కూటమిలో పార్టీల మధ్య అత్యంత కీలకమైన సీట్ల పంపకాల అంశం కొలిక్కి తెచ్చేందుకు 14 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై ఈ భేటీలో సమాలోచనలు జరిపారు. భాజపాను గద్దె దింపడమే ఇండియా కూటమి లక్ష్యమని విపక్ష నేతలు నిర్ణయించారు.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేను ఢీకొట్టేందుకు ఏర్పాటైన విపక్ష కూటమి ఇండియా మూడో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరైన ఈ కీలక భేటీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా ఎన్డీఏపై ఉమ్మడి పోరుకు అత్యంత కీలకమైన సీట్ల పంపకాలపై సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన 14 మంది సభ్యులతో ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఈ కమిటీ త్వరితగతిన పని ప్రారంభించనుంది. ఈ ప్యానల్‌లో కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌, NCP అధినేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఆర్జేడీకి చెందిన తేజస్వీ యాదవ్‌, తృణమూల్‌ నేత అభిషేక్‌ బెనర్జీ, శివసేన నేత సంజయ్‌రౌత్‌ తదితరులు సభ్యులుగా ఉంటారు. విపక్ష కూటమి ఇండియాకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ కమిటీ తీసుకుంటుంది. ఈ నెల 30 కల్లా సీట్ల పంపకాల అంశం కొలిక్కి తేవాలని విపక్ష కూటమి నిర్ణయించింది.


సాధ్యమైనంత వరకు సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలని ఇండియా కూటమిలో తీర్మానం చేశారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీట్ల పంపకాలు జరగాలని అందులో పేర్కొన్నారు. "ఇండియా ఏకమౌతోంది, ఇండియా గెలుస్తుంది' అనే థీమ్‌తో సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష కూటమి పోటీ చేయనుంది. ప్రజా సమస్యలపై దేశంలో వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సార్వత్రిక ఎన్నికలు ముందుగానే నిర్వహించవచ్చని తాము అప్రమత్తంగా ఉండాలని, అయితే ఇండియా భాగస్వామ్యులు వెంటనే ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని ప్రకటించాలని పలువురు నేతలు సూచించారు. రోజురోజుకు ఎన్డీఏ పతనమౌతోందని, ఇండియా బలోపేతం అవుతోందని అన్నారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచార కమిటీ, వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ సోషల్‌ మీడియా, వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ మీడియా, వర్కింగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అని మరో నాలుగు కమిటీలను కూడా ఇండియా కూటమి ఏర్పాటు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story