Independence day : ఎర్రకోటపై జాతీయ పతాక రెపరెపలు

Independence day : ఎర్రకోటపై జాతీయ పతాక రెపరెపలు
వరుసగా పదోసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని... ప్రపంచానికి భారత్‌ మిత్రుడిగా మారిందన్న మోదీ

ఢిల్లీ ఎర్రకోట వేదికగా 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day 2023) ఘనంగా నిర్వహించారు. వరుసగా10వ సారి ఎర్రకోటపై ప్రధాని న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) జెండా ఎగురవేశారు. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని.. ఆ తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు(10th Independence Day speech). ఎర్రకోటపై పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆయన చివరి ప్రసంగం చేశారు.


భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. బాపూజీ చూపిన అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సాధించామని ప్రధాని గుర్తుచేశారు. ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాణి దుర్గావతి, మహాభక్తురాలు మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదని చెప్పారు. కొద్దివారాల క్రితం మణిపుర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని మోదీ అన్నారు. భారత్‌లో జీ20 సమావేశాలు దేశ సామర్థ్యం, వైవిధ్యాన్ని ప్రపంచం ముందుంచాయన్న మోదీ.. జీ20 సమావేశాలు ప్రపంచానికి కొత్త భారతాన్ని పరిచయం చేశాయన్నారు.


కరోనా తర్వాత భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందని మోదీ అన్నారు.కొత్త ప్రపంచంలో మన దేశాన్ని విస్మరించడం ఎవరి తరమూ కాదన్న ప్రధాని... మారుతున్న ప్రపంచంలో భారత్‌ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందన్నారు. దేశమే ప్రథమమన్న పురోగామి ఆలోచనలతో జాతి ముందడుగు వేస్తోందన్నారు.


బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రతి సంస్కరణా జన క్షేమాన్ని కాంక్షించే జరుగుతున్నాయి. సత్తాచాటు, మార్పు చెందు అన్న పద్ధతిలో దేశం ముందడుగు వేస్తోందన్నారు. ప్రతి సంస్కరణలోనూ ఓ పరమార్థం ఉందన్నారు.

2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయన్న ప్రధాని.. అప్పటికి ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందన్నారు. ఆ తర్వాత బలమైన ఆర్థిక విధానాలు, పారదర్శక పాలన దేశానికి కొత్త శక్తినిచ్చాయని తెలిపారు.


2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యమన్న మోదీ... 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ నిలుస్తుందన్నారు. దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయని, దేశంలో తీవ్రవాదం, నక్సలిజం తగ్గాయన్నారు. భారత్‌ ఇప్పుడు సురక్షితంగా ఉందన్న మోదీ... ఇప్పుడు ప్రపంచానికి మిత్రుడిగా భారత్‌ మారిందన్నారు.


ఎర్రకోట వద్ద జరిగిన వేడుకలకు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో దేశరాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత ఏడాదితో పోల్చితే... ఈ ఏడాది పెద్ద సంఖ్యలో అతిథులకు ఆహ్వానం అందింది. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఆహ్వానం పంపారు. ఉజ్వల గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు సహా 660 మందిని పైగా ఆహ్వానించారు.



Tags

Read MoreRead Less
Next Story