Operation Ajay: భారతీయులను రక్షించేందుకు 'ఆపరేషన్ అజయ్'

Operation Ajay:  భారతీయులను రక్షించేందుకు ఆపరేషన్ అజయ్
ఇజ్రాయెల్ యుద్ధ బాధితులను తీసుకువచ్చేందుకు

ఇజ్రాయెల్ యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి తిరిగి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించింది. ఆపరేషన్ అజయ్ కింద, అక్కడ చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా భారతదేశానికి తీసుకువస్తారు. ఇజ్రాయెల్ నుండి తిరిగి వస్తున్న మన పౌరుల కోసం ఆపరేషన్ అజయ్ ప్రారంభించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఉన్న మన పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని జైశంకర్ అన్నారు. ప్రస్తుతం పాలస్థీనా గ్రూప్ హమాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ దేశంలో 20,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారని ముంబయిలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ చెప్పారు.

భారత ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనతో ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం గురువారం నుండి ఆపరేషన్ అజయ్ ప్రారంభమవుతుందని వార్తా సంస్థ ANI తెలియజేసింది. ప్రత్యేక విమానంలో నమోదు చేసుకున్న భారతీయ పౌరులకు సమాచారం అందించామని రాయబార కార్యాలయం తెలిపింది.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో రౌండ్-ది-క్లాక్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్ లో పరిస్థితిని పర్యవేక్షించడానికి, భారతీయులకు సహాయం అందించడానికి టెల్ అవీవ్, రమల్లాలో ప్రత్యేక అత్యవసర హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లోని ఉన్నతాధికారులు, అక్కడి భద్రతా బలగాల సాయంతో ఎయిరిండియా , దౌత్యకార్యాలయాల సమన్వయంతో ఆపరేషన్ అజయ్‌ను నిర్వహిస్తున్నారు.


కేరళ రాష్ట్రానికి చెందిన 7,000 మంది ప్రజలు ఇజ్రాయెల్‌లో ఉన్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వడానికి జోక్యం చేసుకోవాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కోరారు. ఈ మేరకు సీఎం జైశంకర్‌కు లేఖ రాశారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన 84 మంది వ్యక్తుల గురించి తమకు సమాచారం అందిందని తమిళనాడు ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా అక్టోబర్ 8వతేదీన ముంబయికి తిరిగి వచ్చారు. యుద్ధం ప్రారంభమైన సమయంలో ఆమె హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది.

యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదని రాయబార కార్యాలయం ఈ సందర్భంగా తెలిపింది. భారతదేశం ఇంతకు ముందు యుద్ధ ప్రాంతాలు, మహమ్మారి, ప్రకృతి వైపరీత్యాల నుండి తన పౌరులను ఖాళీ చేయించిందని గుర్తు చేసింది. గతంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించేందుకు భారత్ 'ఆపరేషన్ గంగా'ను ప్రారంభించింది. రష్యా యుద్ధంలో సుమారు 20,000 మంది ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. వారిని ఆపరేషన్ గంగా కింద భారత్ కు సురక్షితంగా తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story