Monsoon Prediction 2024 IMD : భారత వాతావరణ శాఖ చల్లని కబురు..

Monsoon Prediction 2024 IMD : భారత వాతావరణ శాఖ చల్లని కబురు..
ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం

ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే ఎక్కవ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం-IMD అంచనా వేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నాలుగు నెలల కాలంలో దేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

దీర్ఘకాల సరాసరి-LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం.... నమోదు కావచ్చని పేర్కొంది. వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లుగా అంచనా వేసింది. ఆగస్టు-సెప్టెంబర్‌ నాటికి దేశంలో లానినా పరిస్థితులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని. వెల్లడించింది. 1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో, లానినాలను అనుసరించి భారత్‌లో తొమ్మిది సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని IMD తెలిపింది.

ఐఎండీ చీఫ్‌ మృత్యంజయ్‌ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 1951 నుంచి 2023 వరకు ఉన్న డేటా ప్రకారం లానినా, ఎల్‌నివో సంఘటనలను అనుసరించి భారత్‌లో తొమ్మిది సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఇక గత నాలుగు సంవత్సరాల రుతుపవనాల సీజన్‌లో సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. ఈ సారి వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. జులై నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపారు.

ఇటీవల, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఇటీవల అంచనా వేసింది. నాలుగు నెలల సుదీర్ఘ కాలానికి దీర్ఘ కాల సగటు 868.6 మిల్లీమీటర్లలో 102 శాతం వర్షపాతం నమోదు అవుతుందని చెప్పింది. మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య భారతం, తూర్పు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని అంచనా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story