Kargil Vijay Diwas: : పాక్ తోక జాడిస్తే తగ్గేదేలే..

Kargil Vijay Diwas: : పాక్ తోక జాడిస్తే తగ్గేదేలే..

కార్గిల్‌ దివస్‌ వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక చేశారు. దేశ గౌరవప్రతిష్ఠల కోసం నియంత్రణ రేఖ దాటడానికైనా సైన్యం సిద్ధమని ప్రకటించారు. కుట్రలకు తెగబడితే బదులిచ్చేందుకు వెనుకాడబోమన్నారు. 24వ కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. కార్గిల్‌ యుద్ధస్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్గిల్‌ యుద్ధంలో సైన్యం చూపిన పరాక్రమాన్ని ప్రస్తావించారు.


భారతీయ విలువలు, అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉన్నప్పటికీ దేశ ప్రతిష్ట కంటే ఏదీ ముఖ్యం కాదని రాజ్‌నాథ్‌ సింగ్‌ తేల్చి చెప్పారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. కేవలం కార్గిల్‌ యుద్ధంలోనే కాదు స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి పలుమార్లు సైన్యం తమ ధైర్య సాహసాలతో దేశం గర్వించేటట్లు చేసిందన్నారు. కార్గిల్ విజయ్‌దివస్‌ను పురస్కరించుకుని ద్రాస్‌లో నాలుగు మిగ్‌ 29 యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు నిర్వహించాయి. తద్వారా కార్గిల్‌ యుద్ధంలో మరణించిన భారత జవాన్లకు నివాళులు ఆర్పించాయి.

Next Story