అమెరికా ఫ్లైట్ ఎక్కిన మోదీ-పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన చైనా

అమెరికా ఫ్లైట్ ఎక్కిన మోదీ-పర్యటనపై అక్కసు వెళ్ళగక్కిన చైనా

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు. పర్యటన గురించి స్వయంగా ట్వీట్ చేసిన మోదీ ఇది భారత్- అమెరికా భాగస్వామ్య శక్తికి ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ రెండు దేశాలు కలిసి బలంగా ఉన్నాయన్నారు. జూన్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న మోదీ అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో పాల్గొనడంతో పాటు అమెరికా ఉభయసభల సంయుక్త సమావేశంలో మాట్లాడనున్నారు. అయితే మోడీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ చైనా ఒక కన్నేసింది. ఇరుదేశాల మధ్య బలపడుతున్న బంధం తమకు ఎక్కడ నష్టాన్ని కలిగిస్తుందో అని లోలోపల తెగ భయపడుతోంది.

మోదీ స్టేట్ విజిట్ నేపథ్యంలో చైనా మీడియా భారత్ ను ఉద్దేశించి రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నాయి.చైనా పురోగతిని అడ్డుకునేలా భారత్ ను ఉసిగొల్పేందుకు అమెరికా ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని, చైనాను కట్టడి చేసే ఆటలో పడొద్దని భారత్ ను ఉద్దేశించి సూచించింది. చైనా అగ్ర దౌత్యవేత్త వాంగ్ యీ, చైనా అధికార పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ లో మూడు దేశాల మధ్య సంబంధాల గురించి మాట్లాడారు. భారత్ పావుగా ఉపయోగించుకుని చైనా ఆర్థిక పురోగతిని అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. బీజింగ్ కు వ్యతిరేకంగా అమెరికా, భారత్ ను ఉపయోగించుకోవాలని కోరుకుంటోందని చెప్పారు. అమెరికాతో భారత్ వాణిజ్య సంబంధాలు, చైనా వాణిజ్యంతో భర్తీ చేయలేదని ఆయన అన్నారు. అయితే మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన పూర్తి చేశారు. ఈ సందర్భంగా బ్లింకెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా సమావేశమయ్యారు. యూఎస్-చైనా సంబంధాలను మెరుగుపరచడంపై చర్చించారు. అయితే ఇప్పటి పరిస్థితులను బట్టి రెండు దేశాల మధ్య భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. కానీ ప్రధాని మోడీ చేస్తున్న ఈ చారిత్రత్మక పర్యటనలో రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య బంధం బలోపేతం అయ్యేలా ఉండబోతోందని వారి అభిప్రాయం.

ఇక ఇప్పటికే పలువురు అమెరికా చట్టసభల సభ్యులు మోడీ పర్యటన కోసం ఎదురుచూస్తున్నామంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story