ISRO: చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌

ISRO: చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 మాడ్యూల్‌
అరుదైన ప్రయోగంలో విజయవంతమయ్యామని ప్రకటించిన ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ కక్ష్యను విజయవంతంగా మార్చినట్టు వెల్లడించింది. చంద్రుడి కక్ష్య నుంచి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని, అరుదైన ఈ ప్రయోగంలో విజయవంతమయ్యామని తెలిపింది. ఒక కక్ష్య పెంపు విన్యాసం, ఒక ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు వివరించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఇస్రో ప్రకటన చేసింది.

భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రయోగాల కోసం చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను తిరిగి భూకక్ష్యలోకి తీసుకొచ్చామని వివరించింది. చంద్రుడి నుంచి భూమికి తీసుకొచ్చే ప్రణాళికలు, వాటి అమలుపై పనిచేస్తున్నామని తెలిపింది. ఇలాంటి విన్యాసాల కోసం సాఫ్ట్‌వేర్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేసతున్నామని, తాజాగా చేపట్టింది ప్రాథమిక ప్రయోగమని ప్రకటనలో పేర్కొంది. చంద్రుడి ఉపరితలంపై ప్రొపల్షన్ మాడ్యూల్ నియంత్రణ కోల్పోకుండా ప్రయత్నిస్తున్నామని, తద్వారా అంతరిక్షంలో శిథిలాలు ఏర్పడకుండా జాగ్రత్తలు ప్రయత్నిస్తున్నామని ఇస్రో వివరించింది.


కాగా.. చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది జులై 14న ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టింది. శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి రాకెట్ ప్రయోగాన్ని చేయగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యింది. అనంతరం అందులోని ప్రజ్ఞాన్ రోవర్‌ చంద్రుడిపై తిరుగాడుతూ అక్కడి పరిస్థితులపై ప్రయోగాలు చేపట్టింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారాన్నిఅందించింది. 14 రోజుల తర్వాత ‘స్లీపింగ్ మోడ్’లో వెళ్లింది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్‌ను మేల్కొలిపేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగించినా ఫలితం దక్కలేదన్న విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story