Chandrayaan-3: మామ దగ్గరికి వెళుతున్నామోచ్…

Chandrayaan-3: మామ దగ్గరికి వెళుతున్నామోచ్…
కాసేపట్లో చంద్రయాన్‌-3 కౌంట్‌డౌన్‌ స్టార్ట్..

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చేపడుతున్న చంద్రయాన్‌-3 ప్రయోగానికి సర్వం సిద్దం అయ్యింది. కాసేపట్లో చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుండటం తో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తల బృందం ఈ తెల్లవారు జామున పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు చేరుకున్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి సంబంధించిన మినియేచర్ ను స్వామివారి ఆలయానికి తీసుకువెళ్లారు. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


చందమామను అందుకోవాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కల నిజం కాబోతోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్‌-3 నింగిలోకి దూసుకుపోనున్నది. 2019లో చెదిరిన కలను ఈసారి నిజం చేసుకోవాలన్న పట్టుదలతో ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. నిజానికి ఇంకాస్తా ముందుగానే ప్రయోగించాలనుకున్నారు. అయితే లాంచ్ విండో అనుకూలతను పరిశీలించి ప్రయోగాన్ని పొడిగించారు. మరోవైపు అత్యంత భద్రత ప్రదేశమైన రాకెట్ ప్రయోగ కేంద్రం ఈ ప్రతిష్టాత్మక ప్రయోగంతో మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. షార్ అడవుల్లో సీఐఎస్‌ఎఫ్‌ దళాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి.

కౌంట్‌డౌన్‌కి ముందు రోజు నుంచే సూళ్లురుపేట, శ్రీహరికోట, మార్గంతో పాటు షార్‌లోని మొదటి, రెండు గేట్ల దగ్గర లాంచ్ ప్యాడ్ వరకు కేంద్ర భద్రత దళాలు ప్రతి ఒక్కరిని పరిశీలిస్తున్నాయి. అణువణుకు తనిఖీ చేస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నింటిలో చైనా, అమెరికా ,రష్యా మాత్రమే సాఫ్ట్ ల్యాండిగ్ చేయగలిగాయి. భారత్‌ కూడా 2019 లో అదే ప్రయత్నం చేసింది అయితే చివరిలో అది విఫలం కావడంతో మరొకసారి చంద్రయాన్‌-3తో ప్రయోగానికి రెడీ అయింది.


ఈ ప్రయోగంలో మూడు మాడ్యూల్స్‌ ఉంటాయి. రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే ప్రొపల్షన్‌ మాడ్యూల్‌. ఇది రాకెట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టి వేరుపడిపోతుంది. రెండవది ల్యాండర్‌ మాడ్యూల్‌.చంద్రుడిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించేది ఇదే. రాకెట్‌ నుంచి విడిపోయిన తర్వాత నిర్ణీత సుదూర కక్ష్యకు చేరుకొని చంద్రుడివైపు ప్రయాణిస్తుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి చేరుకొంటుంది. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్‌ దిగగానే రోవర్‌ బయటకు వస్తుంది. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన పరికరమే రోవర్‌. ఇది చందమామపై ఉన్న మట్టి, మంచును పరిశీలించి సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ రోవర్‌ జీవితకాలం 14 రోజులు. వాతావరణంలో ప్లాస్మా ఆయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతను, నీటి జాడలను ఇందులో ఉండే పరికరాలు గుర్తిస్తాయి. అయితే ఇదంతా ఒక్కరోజులోనో ఒక్క గంటలోనో జరగదు. చంద్రయాన్‌-3 చంద్రుడిని చేరుకోవటానికి 40 రోజులు పడుతుంది.

చంద్రయాన్‌-3 ప్రయోగం కచ్చితంగా విజయవంతం అవుతుందని పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.ఏమాత్రం విఫలం కావడానికి అవకాశం లేకుండా రూపొందించినట్లుగా తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story