Champai Soren: జార్ఖండ్ కొత్త సీఎంగా ‘టైగర్’ చంపై సోరెన్

Champai Soren: జార్ఖండ్ కొత్త సీఎంగా ‘టైగర్’ చంపై సోరెన్
హేమంత్‌ సోరెన్‌ రాజీనామా..

ఝార్ఖండ్‌ రాజకీయాల్లో సంచలనం సంభవించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం హేమంత్ సోరెన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ -ED విచారణ ఎదుర్కొన్న ఆయన రాజ్‌భవన్‌కు చేరుకునిగవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. అనంతరం ఝార్ఖండ్‌ రవాణశాఖ మంత్రి చంపై సోరెన్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి బన్నా గుప్తా తెలిపారు. చంపై సొరేన్‌ ఝార్ఖండ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అందుకోసం గవర్నర్‌ అపాయిట్‌మెంట్‌ కోరేందుకే రాజ్‌భవన్‌కు వచ్చామని బన్నా గుప్తా వెల్లడించారు.

ఇప్పటికే ఝార్ఖండ్‌లో అధికార కూటమిలోని ఎమ్మెల్యేలు రెండు మినీ బస్సుల్లో రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ అపాయిట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఏడుగురు సభ్యుల ఈడీ అధికారుల బృందం..భారీ భద్రత మధ్య మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రాంచీలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకుంది. ఒంటి గంటా 20 నిమిషాలకు విచారణ ప్రారంభమైంది. అధికార ఝార్ఖండ్ ముక్తి మోర్చాకు కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈనెల 20న కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ విచారణ అనంతరం సీఎం నివాసం నుంచి ఈడీ అధికారులు బయటకు వెళ్లగా హేమంత్‌ సోరెన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారని తెలుస్తోంది. ED విచారణ నేపథ్యంలో JMM శ్రేణులు పెద్దసంఖ్యలో సోరెన్ నివాసానికి తరలివచ్చాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య ఏర్పడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు... CM హేమంత్ సోరెన్ఈ డీ అధికారులపై రాంచీ ఎస్సీ, ఎస్టీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేధింపు చర్యల్లో భాగంగా దిల్లీలోని తన నివాసంలో సోదాలు చేయటమే కాకుండా తనతోపాటు తన వర్గం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని హేమంత్ సోరెన్ ఆరోపించారు.

హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను సీఎంగా చేయాలని ముందుగా భావించినా హేమంత్ సోరెన్ వదిన, శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో నిర్ణయాన్ని మార్చుకున్న జేఎంఎం పార్టీ.. చంపై సోరెన్ పేరును తెరపైకి తీసుకువచ్చింది. చంపై సోరెన్.. జార్ఖండ్ రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ప్రారంభించినప్పటి నుంచి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి పనిచేశారు. ప్రస్తుతం జార్ఖండ్ రవాణా శాఖా మంత్రిగా చంపై సొరేన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా పని చేస్తున్నారు. 67 ఏళ్ల చంపై సోరెన్ జార్ఖండ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story