INDIA Alliance: ప్రధాని అభ్యర్థి ‘అతనే’..

INDIA Alliance:  ప్రధాని అభ్యర్థి ‘అతనే’..
ప్రధాని అభ్యర్థిగా నితీష్ కుమార్‌ను మించిన సమర్థుడు లేడు: జేడీయూ నేత

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్, జేడీయూ, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పార్టీలు కూటమి కట్టాయి. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. దీనిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని కూటమి నేతలు చెప్తున్నప్పటికీ.. ప్రధాని అభ్యర్థి బరిలో ఎవరున్నారనే సస్పెన్స్‌పై మాత్రం తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని పదవిపై చాలా మంది నేతల గురి ఉంది. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని పదవికి అర్హులని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నితీష్ కుమార్ ప్రధాని అవుతారని ఆయన పార్టీ జేడీయూకు చెందిన నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రధానిగా తమ పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని డిప్యూటీ స్పీకర్, జేడీయూ నేత మహేశ్వర్ హజారీ అన్నారు. నితీష్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా I.N.D.I.A. కూటమి త్వరలో ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానిగా కావాల్సిన అన్ని లక్షణాలు నితీశ్ కుమార్‌లో ఉన్నాయన్నారు. I.N.D.I.A. కూటమి ప్రధాని పేరును ఎప్పుడు ప్రకటించినా అది నితీష్ కుమార్ పేరే అన్నారు. దేశంలో రామ్‌మనోహర్‌ లోహియా తర్వాత మహోన్నతమైన సోషలిస్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది నితీష్‌ కుమార్‌ మాత్రమేనని గతంలో ప్రధాని మోదీ చెప్పారని హజారీ గుర్తు చేసుకున్నారు. నితీష్ కుమార్ ఐదుసార్లు కేంద్రంలో మంత్రిగా పనిచేశారని, 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ సన్నద్ధతపై మీడియా ప్రశ్నించగా.. అందుకు ఈ విధంగా హజారీ సమాధానం ఇచ్చారు. హజారీతో పాటు ఇతర నాయకులు సైతం.. నితీశ్ కుమారే ప్రధాని అభ్యర్థి అవ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


అయితే నితీష్ కుమార్ మాత్రం తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను నాయకత్వం వహిస్తానని పలుమార్లు చెప్పారు. నేను ఇప్పటికే చెప్పానని, మళ్లీ చెబుతున్నానని, తాను ఏ పదవి కోరుకోవడం లేదని, ప్రతిపక్ష నాయకులను ఏకం చేసి ముందుకు సాగుతామని నితీష్ కుమార్ గతంలో చెప్పారు. ఇదిలావుండగా.. ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ మూడు సమావేశాలు నిర్వహించింది. ఈ చర్చల్లో తమ భవిష్యత్తు వ్యూహాలు, ఇతర అంశాలపై చర్చలు జరిపారు కానీ.. ప్రధాని అభ్యర్థి ఎవరనే సస్పెన్స్‌కి మాత్రం తెరదించలేదు.

Tags

Read MoreRead Less
Next Story