Bengaluru: నేమ్‌ప్లేట్లలో ‘60% కన్నడ’ఆదేశాలపై ర్యాలీలు

Bengaluru: నేమ్‌ప్లేట్లలో ‘60% కన్నడ’ఆదేశాలపై ర్యాలీలు
షాపుల ముందు ఇంగ్లీషు నేమ్ ప్లేట్స్ తొలగించిన కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు

కన్నడ భాషకు సంబంధించిన వివాదం కర్ణాటక లో ఉద్రిక్తంగా మారింది. వాణిజ్య వ్యాపార నిర్వాహకులు తన షాపులకు పెట్టే పేర్లను, బోర్డులపై కేవలం కన్నడ భాషలోనే రాయలని కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనకారులు నిరసనలు చేపట్టారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డులపై 60 శాతం కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనికి మద్దతినిస్తూ కర్ణాటక రక్షణ వేదిక రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది. ఈ క్రమంలో బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తంగా మారాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా నిరసనకారులు చెలరేగిపోయారు. హోటళ్లు, దుకాణాలపై ఇంగ్లీష్‌లో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


కన్నడలో అక్షరాలు ఉండాలని బెంగళూరు నగరపాలక సంస్థ ఆదేశాలు ఇవ్వడంతో.. తక్షణమే అమలు చేయాలని కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు డిమాండు చేస్తూ బెంగళూరులో ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో హోటళ్లు, దుకాణాల బయట ఇంగ్లీష్‌లో ఉన్న బోర్డులను ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల నల్లరంగు పూశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ వివాదంపై బృహత్‌ బెంగళూరు మహానగర సంస్థ చీఫ్ కమిషనర్‌ తుషార్‌ గిరినాథ్‌ మాట్లాడారు. ఈ ఆదేశాలు ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఆ నియమాలను పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే మున్సిపాల్టీ ఇచ్చిన ఆదేశాల గురించి త‌మ‌కు అవ‌గాహ‌న లేద‌ని, అందుకే ఆ నిబంధ‌న‌లు పాటించ‌లేక‌పోయిన‌ట్లు వాణిజ్య సంఘాలు తెలిపాయి.

మరోవైపు.. పౌరసరఫరాల పరిధిలోని వాణిజ్య దుకాణాలు 60% తప్పకుండా కన్నడ భాషలో రాయాలన్న ఆదేశాలను పాటించేందుకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడవు ఉందని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) చీఫ్ తుషార్ గిరినాథ్ తెలిపారు. ఆ గడువు లోపు ఆదేశాలను పాటించకపోతే.. వ్యాపార లైసెన్స్‌లను సస్పెండ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు అక్టోబర్‌లో.. కర్ణాటకలో నివసించే ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. అప్పటి నుంచి ఈ భాషా వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. తన మునుపటి పదవీకాలంలోనూ స్థానిక భాష విస్తృత ఉపయోగం కోసం ముందుకొచ్చినప్పుడు.. బెంగళూరు మెట్రో స్టేషన్లలోని హిందీ పేర్లను లక్ష్యంగా చేసుకుని టేప్‌తో కప్పేయడం జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story