Kargil Vijay Diwas: కార్గిల్‌ అమరవీరులకు దేశం నివాళి

Kargil Vijay Diwas: కార్గిల్‌ అమరవీరులకు దేశం నివాళి
అమర సైనికుల త్యాగాలు మరువలేమన్న ప్రధాని మోదీ... అమరవీరుల స్థూపం వద్ద రాజ్‌నాథ్ నివాళులు...

కార్గిల్ విజయ్ దివస్ (Vijay Diwas) సందర్భంగా ఆ పోరాటంలో వీర మరణం పొందిన సైనికులకు దేశం నివాళులు అర్పించింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా సైనికులకు ప్రధాని మోదీ(Pm MODI) నివాళులర్పించారు. దేశ అసమాన యోధుల ధైర్య సాహసాలను మరోసారి దేశం గుర్తు చేసుకుంటుందని ప్రధాని అన్నారు. కోట్లాది మంది దేశ ప్రజలకు వారి జీవితం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జై హింద్‌ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీతో సహ పలువురు కేంద్రమంత్రులు ముఖ్యమంత్రులు కార్గిల్‌ వీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.


లద్దాఖ్‌లోని అమరవీరుల స్థూపం (Kargil war Bravehearts) వద్ద రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(RAJANATH) నివాళులు అర్పించారు. సైన్యాధికారులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరులకు అంజలి ఘటించారు. 1999 కార్గిల్ అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వారి స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం కార్గిల్ అమరుల కుటుంబాలను రాజ్‌నాథ్ కలిశారు.

అనంతరం నిర్వహించిన సైనిక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రెండు రోజుల పాటూ ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నాలుగు మిగ్ 29 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, మూడు చీతల్ హెలికాప్టర్లతో కార్గిల్ అమరుల స్థూపంపై పూలజల్లు కురిపించారు.


చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ వీర్ చౌదరిలు కూడా కార్గిల్ అమరులకు నివాళులు అర్పించారు. లక్నోలోని కార్గిల్ అమరుల స్థూపం వద్ద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.

భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం 1999 మే 3న ప్రారంభమై.. జూలై 26న ముగిసింది. అందుకే ప్రతి ఏటా జూలై 26న 'కార్గిల్ విజయ్ దివస్' ను జరుపుకుంటారు. 1999, జూలై 26న పాకిస్తాన్ సైన్యం పై భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని (Kargil Vijay Diwas) దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు కశ్మీర్ ను ఆక్రమించుకోవాలన్న దురద్దేశంతో పాకిస్తాన్ సైన్యం ట్రైబల్ మిలీషియా మద్దతుతో 'ఆపరేషన్ బదర్' అనే పేరిట చొరబాటుదారులను భారత సరిహద్దుల్లోకి పంపించింది. చొరబాటుదారులు కార్గిల్ యొక్క ద్రాస్‌లోని జాతీయ రహదారిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి కశ్మీర్ లోయను లద్దాఖ్‌కు కలిపే కీలక రహదారిపై పట్టు సాధించారు. తర్వాత పాకిస్థానీ చొరబాటుదారులు కాశ్మీర్ లోయ ప్రాంతంలోకి ప్రవేశించి దానిని ఆక్రమించుకోవాలని చూశారు.


1999, మే 3న కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్థాన్ మధ్య కార్గిల్ యుద్ధం మెుదలైంది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' అనే మిషన్ ప్రారంభించిన దాదాపు రెండు నెలలపాటు గడ్డకట్టే చలిలో పోరాడింది. ఈ యుద్దంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో భారత్ కు చెందిన 527 మంది సైనికుల అమరులయ్యారు. దాదాపు 1000 మది పాకిస్థానీ సైనికులు మృతి చెందారు. చివరికి జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి.. తన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది భారత్. దీనికు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ ను జరుపుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story