Kedarnath: కేదార్‌నాథ్‌ యాత్రకు బ్రేక్..

Kedarnath: కేదార్‌నాథ్‌ యాత్రకు బ్రేక్..
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు... కేథార్‌నాథ్‌ను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు

ఉత్తరాఖాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అధికమయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో పుష్కర్‌ సింగ్‌ ధామి ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్త చర్యగా కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు యాత్రికులను అనుమతించొద్దని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశించారు. రుద్ర ప్రయాగ్‌ జిల్లాలో ఎడతెగని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోన్‌ ప్రయాగ్‌లో యాత్రికులను నిలిపివేసినట్లు రుద్రప్రయాగ కలెక్టర్ మయూర్‌ దీక్షిత్‌ వెల్లడించారు. ఇప్పటికే బయల్దేరి వెళ్తున్న యాత్రికులను సోన్‌ప్రయాగ వద్ద నిలిపివేశామని... వారు ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఉత్తరాఖండ్‌ విపత్తు నిర్వహణ కేంద్రాన్ని సీఎం పుష్కర్‌ సింగ్‌ధామి అకస్మాత్తుగా సందర్శించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సన్నద్ధతపై ఆరా తీశారు. ఇవాళ ఉదయం 8 గంటల వరకు 5828 మంది యాత్రికులు సోన్‌ప్రయాగ నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. రుద్రప్రయాగ, సోన్‌ప్రయాగ, కేదార్‌నాథ్‌ ప్రాంతాల్లోనే కాకుండా ఉత్తరాఖండ్‌లోని వివిధ చోట్ల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో హరిద్వార్‌లో అత్యధికంగా 78 మి.మీ వర్షం కురిసింది. డెహ్రడూన్‌లో 33.2 మి.మీ., ఉత్తరకాశీలో 27.7 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. అధిక వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఆదేశించారు. అధికారులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని, రెస్క్యూ ఆపరేషన్లకు సన్నద్ధం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. రుతు పవనాల కారణంగా రాబోయే ఐదారు రోజుల్లో భారీగా వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అప్రమత్తం హెచ్చరించింది. ఒకవేళ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వస్తే వస్తే తగినన్ని నైట్ షెల్టర్లు, సహాయ సామగ్రి ప్రతి జిల్లాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story