Kerala: పోలీసులే ఆ కుక్కల టార్గెట్

Kerala: పోలీసులే ఆ కుక్కల టార్గెట్
కేరళ డ్రగ్ డీలర్ భయానక పన్నాగం

డ్రగ్స్ స్మగ్లర్లు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎప్పుడూ రకరకాల ప్లాన్లు చేస్తారు. కేరళలోని కొట్టాయంలో ఓ స్మగ్లర్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ కుక్కల సైన్యాన్ని సిద్ధం చేశాడు. ఖాకీ యూనిఫామ్‌లో ఉన్న వ్యక్తులను కనపడగానే కరిచేసేలా కుక్కలకు శిక్షణ ఇచ్చాడు. ఆదివారం రాత్రి కేరళ పోలీసు బృందం స్మగ్లర్ల రహస్య స్థావరం వద్దకు చేరుకోగానే.. కుక్కలు సైనికుల్లా పోలీసులపై దాడి చేశాయి. పోలీసులు కుక్కలను అదుపు చేసే సమయాన్ని అవకాశంగా తీసుకుని నిందితుడు పరారయ్యాడు. స్మగ్లర్ ఇంట్లో 17 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కొట్టాయం పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. పోలీసులపై దాడి చేసేందుకు శిక్షణ పొందిన కుక్కలను అదుపు చేశామన్నారు.


కేరళలోని కొట్టాయంలో ఉన్న ఓ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. వెంటనే కొంత మంది పోలీసులు ఆదివారం రాత్రి ఆ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్లిన పోలీసుల డ్రెస్‌లు చూసిన కుక్కలు వారిపై దాడికి పాల్పడ్డాయి. దీంతో పోలీసులు వచ్చారని గుర్తించిన నిందితుడు పరారయ్యాడు.


ఆ ఇంటి నుంచి పోలీసులు 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుడి గురించి సంచలన విషయాలు తెలుసుకున్నారు. పోలీస్ యూనిఫాం వేసుకుని ఎవరైనా వస్తే వారిని కరిచేలా, వారిపై దాడి చేసేలా నిందితుడు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చినట్లు గుర్తించారు. డాగ్ ట్రైనర్ అని చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్న నిందితుడు డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నాడు. అతనివద్ద కొన్ని సొంత కుక్కలే కాకుండా ఇంకా కొన్ని కుక్కలకు ట్రైనింగ్ ఇస్తూ వాటి యజమానుల వద్ద రోజుకు ఒక్కో శునకానికి రూ.1000 తీసుకుంటున్నాడు. అయితే అవి కూడా పోలీసులు కనపడగానే కరిచేసేలా ట్రైన్ చెయ్యబడ్డాయి. అయితే కుక్కలకు ఎలా శిక్షణ ఇవ్వాలనేదానిపై రిటైర్డ్ బీఎస్ఎఫ్ ఆఫీసర్ వద్ద నిందితుడు ట్రైనింగ్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ప్రత్యేకంగా పోలీసులను గాయపరచడం ఎలా అనే ప్రశ్న అడిగినందుకు పోలీసు అధికారి అతనిని బయటకు పంపేసినట్టు సమాచారం. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ డ్రగ్ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story