Kizhoor village: చరిత్ర మరిచిన సజీవ సాక్ష్యం

Kizhoor village: చరిత్ర మరిచిన సజీవ సాక్ష్యం
స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కిజూర్‌... ఫ్రెంచ్‌ పాలనకు ముగింపు పలికిన చారిత్రక ప్రాంతం....

భారత స్వాతంత్ర ఉద్యమంలో చాలా ప్రాంతాలకు ప్రత్యేకమైన స్థానం, ఖ్యాతి, గుర్తింపు ఉంటుంది. అలా దేశ స్వాతంత్ర సంగ్రామ ఘట్టంలో పుదుచ్చేరిలోని మంగళం నియోజకవర్గంలోని మారుమూల గ్రామం కిజూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అప్పుడు ఫ్రెంచ్‌ పాలనలో ఉన్న పుదుచ్చేరి, కారైకల్ , యానాం, మహే ప్రాంతాలు ఫ్రెంచ్‌ పాలనలోనే కొనసాగాలా లేక ఇండియన్ యూనియన్‌లో చేరాలా అనే అంశంపై కిజూర్‌లోనే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఎటువంటి రాజకీయ, పరిపాలనా జోక్యం లేకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడం కోసం కిజూర్‌ గ్రామమే సరైందని అందరూ అభిప్రాయపడ్డారు


భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పుదుచ్చేరి, కారైకల్ , యానాం, మహే ప్రాంతాల్లో ఫ్రెంచ్ పాలన కొనసాగింది. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం... ఫ్రెంచ్ పాలనలోని భూభాగాలను దేశంలో కలిపేందుకు చర్చలు ప్రారంభించింది. విలీనానికి అనుకూలంగా ఊరేగింపులు నిర్వహించారు. ఇలా ఉద్యమం పతాకస్థాయికి చేరడంతో ఫ్రెంచ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పాలనలోని భూభాగాలు భారత్‌ యూనియన్‌లో విలీనం కావాలా వద్ద అన్న అంశంపై రిఫరెండం నిర్వహించాలని నిర్ణయించాయి. అలా 1954 అక్టోబర్‌ 18న పుదుచ్చేరి పట్టణానికి 22కి.మీ దూరంలో ఉన్న కిజూర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. 181 మంది కౌన్సిలర్లలో 174 మంది కౌన్సిలర్లు ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీని తర్వాత దాదాపుగా ఎనిమిదేళ్లకు ఆగస్టు 16, 1962న పుదుచ్చేరిని ఇండియన్ యూనియన్‌తో అధికారికంగా విలీనం చేసేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అలా కిజూర్‌ ఒక చారిత్రక ఘట్టానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది.ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న కిజూర్‌కు తగిన ప్రాముఖ్యత దక్కలేదు.



స్వాతంత్య్రానంతరం ఆగస్టు 16 ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, పుదుచ్చేరి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆ రోజును డి జ్యూర్ బదిలీ దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది. కానీ అది ఏదో మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అప్పుడు చర్చలు జరిగిన ప్రాంతం ఇప్పటికీ అలాగే ఉంది. పుదుచ్చేరి విముక్తికి ముందు జరిగిన కార్యక్రమాలలో పాల్గొన్న దేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో సహా ప్రముఖ ప్రముఖుల కొన్ని ముఖ్యమైన ఛాయాచిత్రాలను ఒక గదిలో భద్రపరిచారు.ఆగస్టు 16న జెండాను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేసిన స్తంభం, ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న వ్యక్తుల పేర్లతో కూడిన శిలా ఫలకం ఎవరికీ పట్టకుండా అలానే ఉన్నాయి.

కిజూర్‌ సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే సజీవంగా ఉంటుందని, అది నవంబర్ 1, ఆగస్ట్ 16నే అని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రెండు రోజులు తప్పితే ఈ చారిత్రక స్థలాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడి మ్యూజియం కూడా చాలా రోజులుగా ప్రజలకు అందుబాటులో లేదు. కిజూరును చారిత్రక స్థలంగా మార్చి అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వాలు హామీలు నీటిపైన రాతలయ్యాయి.కిజూర్‌ను యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించేందుకు కృషి చేయాలని చాలామంది సూచిస్తున్నారు. కిజూర్ స్మారక కట్టడాన్ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మన చరిత్ర తెలపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story