POCSO Cases : ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌

POCSO Cases :  ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లో లక్షలాది కేసులు పెండింగ్‌
పరిష్కారానికి 10 నుంచి 25ఏళ్లు పట్టే అవకాశం

ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో లక్షలాది పోక్సో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. బాలలపై లైంగిక నేరాల కేసులు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో లక్షలాదిగా పెండింగ్ లో ఉన్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా, పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించాలంటే కనీసం తొమ్మిదేళ్లు పట్టే అవకాశం ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పెండింగ్ కేసుల పరిష్కారానికి కనీసం 25 ఏళ్లు పడుతుందని ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్(ఐసీపీటీ) నివేదిక పేర్కొంది. 2023 జనవరి 31వ తేదీ నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 2,43,237 పోక్సో కేసులు నమోదైనట్లు తెలిపింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేసు నమోదు అయినప్పటి నుంచి ఒక ఏడాదిలోగా విచారణను ముగించి, దోషులను శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మొత్తం 2,68,038 కేసులు కాగా, వీటిలో కేవలం 8,909 కేసుల్లో మాత్రమే దోషిత్వ నిర్ధారణ జరిగిందని ఐసీపీటీ వెల్లడించింది.

బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన కేసుల్లో ఏడాది లోపునే విచారణ ముగించి.. చిన్నారులకు న్యాయం అందించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో 2019లో దేశవ్యాప్తంగా ఫాల్టాక్ స్పెషల్ కోర్టులు (ఎఫ్ఎఎస్సీ) ఏర్పడ్డాయి. ప్రభుత్వం కూడా భారీగానే ఈ న్యాయస్థానాలకు నిధులు కేటాయించింది. ఈ కోర్టులు మూడు నెలల్లో 41 నుంచి 42 కేసులు పరిష్కారం కావాలి. ఏడాదికి 165 వరకు కేసుల్లో తీర్పు ఇవ్వాలి. కానీ ఏడాదికి కేవలం 28 కేసులు మాత్రమే పరిష్కారమవుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఒక్కో కేసు పరిష్కారానికి రూ.9 లక్షలు ఖర్చవుతోంది. దిగ్భ్రాంతి కలిగించే మరో విషయమేంటంటే కేవలం 3 శాతం పోక్సో కేసుల్లోనే నిందితులకు శిక్ష పడుతుండటం. "ఇది ఆందోళన కలిగించే విషయం. చట్టం స్ఫూర్తి.. ప్రతి చిన్నారికి న్యాయం జరగడంలో ప్రతిఫలించాలి" అని ఐసీపీఎఫ్ వ్యవస్థాపకుడు భువన్ రిబు తెలిపారు. న్యాయ, మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖలు, జాతీయ నేర రికార్డుల విభాగం గణాంకాలు ఆధారంగా ఈ పరిశోధన పత్రం తయారు చేసినట్లు ఆయన తెలిపారు. బాల్య వివాహాలపైనా ఈ పరిశోధన పత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి రోజు 4,452 మైనర్ బాలికలకు వివాహం జరుగుతోందని, నిమిషానికి ముగ్గురు బాలికలు బలవుతున్నారని, అయినా రోజుకు మూడు కేసులే నమోదవుతున్నాయని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story