Chandrayaan 3: ప్రజ్ఞాన్‌ రోవర్‌ పై ఇంకా నమ్మకం ఉంది

Chandrayaan 3: ప్రజ్ఞాన్‌ రోవర్‌ పై ఇంకా నమ్మకం ఉంది
నిద్రాణ స్థితి నుంచి మేల్కొనే అవకాశముందన్న ఇస్రో చైర్మెన్‌

చంద్రయాన్‌-3 సక్సెస్‌తో చరిత్ర సృష్టించిన ఇస్రో.. రోవర్‌ ప్రజ్ఞాన్‌ను తిరిగి మేల్కొపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇప్పటికీ నిద్రాణ స్థితి నుంచి రోవర్‌ మేల్కొనే అవకాశముందని ఇస్రో చైర్మెన్‌ ఎస్‌ సోమనాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ‘చంద్రయాన్‌-3 మిషన్‌లో ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ నుంచి రావాల్సిన డాటా అంత వచ్చేసింది. అనుకున్న విధంగా పరీక్షలు చేపట్టాం. ప్రస్తుతం నిద్రాణ స్థితి లో ఉంది. తిరిగి తప్పకుండా మేల్కొంటుందన్న ఆశ మాత్రం ఉంది’ అని అన్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు పంపిన చంద్రయాన్‌-3 మిషన్‌ ప్రజ్ఞాన్‌ రోవర్‌ ప్రస్తుతం శివశక్తి పాయింట్ వద్ద నిద్రాణ స్థితిలో ఉంది. ఇది తిరిగి మేల్కొనడంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోవర్ మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమని, అది నిద్రలేవడంపై ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయన్నారు. గురువారం కొచ్చిలో మలయాళ మనోరమ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్ సోమనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ప్రయోగానికి ముందు రోవర్‌ను తాము మైనస్‌ 200 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద పరీక్షించినప్పుడు అది పనిచేసింది.. ప్రజ్ఞాన్‌ మళ్లీ క్రియాశీలమవుతుందని ఆశలు పెట్టుకోవడానికి అదే కారణం.. కానీ, విక్రమ్ ల్యాండర్ భారీ నిర్మాణం కావడంతో దాన్ని పూర్తిగా పరీక్షించలేకపోయాం’ అని చెప్పారు. అయితే, 42 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో బహిర్గతమయ్యే రేడియేషన్, ల్యాండింగ్ సమయంలో అటుఇటు ఊగిసలాట కారణంగా ప్రజ్ఞాన్ కోలుకోవడంలో కొంత ఇబ్బంది పడవచ్చు. ‘కాబట్టి దీనిని అంచనా వేయడం చాలా కష్టం’ అని సోమనాథ్ అన్నారు. కానీ, చంద్రయాన్-3 మిషన్ అనుకున్న లక్ష్యం నెరవేరిందని ఇస్రో చీఫ్ స్పష్టం చేశారు.

ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా దిగింది. విక్రమ్ ల్యాండర్, అందులోని రోవర్‌ జీవిత కాలం 14 రోజులే. చంద్రుడి ఉపరితలంపై ఒక రోజు (లూనార్ డే) అంటే భూమిపై సుమారు 28 రోజులతో సమానం. అంటే చంద్రుని మీద సుమారు 14 రోజులు పగలు, 14 రోజులు రాత్రి ఉంటుంది. ఆగస్టు 23న చంద్రుడి మీద పగలు మొదలైంది. అందుకే ఇస్రో ఆ రోజు ల్యాండర్‌ను దించింది. చంద్రుని మీద పగలు పూర్తి కానున్న నేపథ్యంలో సెప్టెంబరు 4న ల్యాండర్, రోవర్లను స్లీప్ మోడ్‌లోకి ఇస్రో పంపింది.తరువాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రలేపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ, వాటి నుంచి ఎలాంటి సిగ్నల్స్ ఇప్పటివరకు రాలేదు.


Tags

Read MoreRead Less
Next Story