Lok Sabha: ఢిల్లీ అర్డినెన్స్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Lok Sabha: ఢిల్లీ అర్డినెన్స్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే ఆమోదం.... ప్రజా సంక్షేమం కోసమే బిల్లు అన్న అమిత్‌ షా... ఢిల్లీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్న కేజ్రీవాల్‌...

దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీపై నియంత్రణ కోసం తెచ్చిన వివాదాస్పద జాతీయ రాజధాని ప్రాంత బిల్లును (సవరణ)-2023 (National Capital Territory of Delhi (Amendment) Bill, 2023) లోక్‌సభ( Lok Sabha) ఆమోదించింది. మూజువాణి (వాయిస్‌) ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు(Delhi services bill) ఆమోదం పొందినట్లు( passed by Lok Sabha) విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. ముందు బిల్లుపై సభలో చర్చలో పాల్గొన్న ప్రతిపక్షాలు ఓటింగ్‌ సమయంలో సభ నుంచి వాకౌట్‌ చేశాయి. నేడు రాజ్యసభ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్లు చర్చకు రానుంది. దిల్లీ సేవల నియంత్రణ ఆర్డినెన్స్ స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ, బీజేడీ మద్దతు తెలిపాయి. ఈ బిల్లుపై చర్చ తర్వాత అమిత్ షా సమాధానం ఇస్తున్న సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన ఆప్ ఎంపీ(AAP MP) సుశీల్ కుమార్ రింకూను....ఈ సమావేశాల వరకు సస్పెండ్ చేశారు.


నాలుగున్నర గంటల చర్చ తర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా‍ (Amit Shah‌) సమాధానం ఇచ్చారు. దిల్లీసహా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉందన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా జట్టు కట్టిన ప్రతిపక్షాలు బిల్లు ఆమోదం పొందిన తర్వాత చెల్లాచెదురు అవుతాయని అమిత్ షా జోస్యం చెప్పారు. నిబంధనల ప్రకారం ఆప్ ప్రభుత్వం పనిచేయటం లేదని, కనీసం అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ సమావేశాలను కూడా సరిగ్గా నిర్వహించటం లేదని ఆరోపించారు. ఈ బిల్లు రాజ్యాంగం ప్రకారం చెల్లుబాటు అవుతుందని, దిల్లీ ప్రజల మేలు చేసినట్లు అమిత్ షా పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసమే దిల్లీ సర్వీసుల బిల్లును తీసుకొచ్చినట్లు అమిత్‌ షా చెప్పారు. దిల్లీ సేవలు ఎప్పటికీ కేంద్రంతోనే ముడిపడి ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని అన్నారు.


బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. దిల్లీ ప్రజలను బానిసలుగా చేసేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. లోక్‌సభలో హోం మంత్రి అమిత్‌షా మాటలు దిల్లీ ప్రజల హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయని అన్నారు. తప్పు చేస్తున్నామన్న సంగతి కేంద్రానికి కూడా తెలుసని కేజ్రీవాల్‌ అన్నారు. కేంద్రం తెచ్చిన బిల్లు కేవలం దిల్లీ ప్రజలను బానిసలను చేసేందుకే అని దిల్లీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.


ఢిల్లీలో గ్రూపు-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను ‘నేషనల్‌ కేపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీ’ ఏర్పాటు చేయాలన్నది కేంద్రం ప్రతిపాదన. దీనిపై ఆప్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మే 11న తీర్పు వెలువడింది. ఆ నేపథ్యంలో అదే నెల 19న కేంద్రం ఆర్డినెన్సు జారీ చేసింది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో దానిని బిల్లు రూపంలో తీసుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story