Madhya Pradesh: సామాన్యుడిపై కలెక్టర్ చిందులు.. సీఎం సీరియస్

Madhya Pradesh: సామాన్యుడిపై కలెక్టర్ చిందులు..  సీఎం సీరియస్
తీవ్రంగా స్పందించిన సీఎం, కలెక్టర్‌పై వేటు

ఓ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్ కిశోర్ కన్యాల్‌పై వేటు పడింది. కలెక్టర్ బాధ్యతల నుంచి ఆయనను తొలగిస్తూ సీఎం మోహన్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కన్యాల్‌ను రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ పదవికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నార్సింగ్‌పూర్ కలెక్టర్ రిజు బఫ్నా‌కు షాజాపూర్ కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది.

కాగా ట్యాంకర్, ట్రక్కర్ల నిరసన నేపథ్యంలో డ్రైవర్ యూనియన్ ప్రతినిధులతో మంగళవారం జరిపిన చర్చల్లో అధికారి కిశోర్ కన్యాల్ సహనం కోల్పోయారు. ‘నీ స్టేటస్ ఏంటి’ అని ఓ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. కన్యాల్ సహనం కోల్పోయి మాట్లాడుతున్న సమయంలో పద్ధతిగా మాట్లాడాలని ఓ ప్రతినిధి కోరారు. దీంతో కిశోర్ కన్యాల్ మరింత ఆగ్రహంతో మాట్లాడారు.

పద్ధతిగా మాట్లాడాలని కోరిన ఓ డ్రైవర్‌పై ‘ నువ్వు ఏం చేస్తావ్? నీ స్టేటస్ ఏంటి?’ అంటూ విరుచుకుపడ్డారు. ‘ మాకు స్టేటస్ లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నాం’ అని సదరు డ్రైవర్ బదులిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు సదరు డ్రైవర్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత కన్యాల్ క్షమాపణలు చెప్పినప్పటికీ ప్రభుత్వం ఉపేక్షించలేదు.

తమ ప్రభుత్వంలో అధికారులు ఇలాంటి భాషను వాడితే సహించేది లేదని సీఎం మోహన్ యాదవ్ హెచ్చరించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము పేదల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాం. ఎంత పెద్ద అధికారి అయినా పేదల కష్టానికి, వారి భావాలకు గౌరవమివ్వాలి’’ అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story